'మా' పేరిట మోసాలు

by Muthe.Rajitha |

సినిమా ఇండస్ట్రీలో 'మా'(MAA) పేరిట జరుగుతున్న భారీ మోసాలు వెలుగులోకి వచ్చాయి.

మా పేరిట మోసాలు
X

దిశ, వెబ్ డెస్క్ : సినిమా ఇండస్ట్రీలో 'మా'(MAA) పేరిట జరుగుతున్న భారీ మోసాలు వెలుగులోకి వచ్చాయి. కొత్తగా వచ్చే నటుల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని, మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (MAA) పేరుతో సాగుతున్న మోసాలపై అసోసియేషన్ వర్గాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. సంస్థను పోలి ఉండేలా 'AP MAA', 'MAA AP' వంటి పేర్లతో నకిలీ సంఘాలను ఏర్పాటు చేసి, అవి 'మా' అసోసియేషన్‌కు ప్రాంతీయ శాఖలని నమ్మబలుకుతూ కొందరు వ్యక్తులు అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నట్లు వెల్లడైంది. ఈ పేర్ల విషయంలో ఉన్న సారూప్యత వల్ల కొత్తవారు సులభంగా కన్‌ఫ్యూజ్ అవుతూ, సభ్యత్వాల పేరుతో అడిగినంత డబ్బు చెల్లించి మోసపోతున్నారు. ఇండస్ట్రీలో అవకాశాలు ఇప్పిస్తామని, మెంబర్‌షిప్ కార్డులు త్వరగా వచ్చేలా చేస్తామని నమ్మబలికి భారీ మొత్తంలో నగదును కాజేస్తున్న ఈ ముఠాల పట్ల అప్రమత్తంగా ఉండాలని మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ప్రతినిధులు హెచ్చరించారు.

అలాగే హైదరాబాద్ కేంద్రంగా పనిచేసే అధికారిక 'మా' అసోసియేషన్‌కు, పైన పేర్కొన్న నకిలీ సంస్థలకు ఎలాంటి సంబంధం లేదని వారు స్పష్టం చేశారు. మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ పేరును అడ్డం పెట్టుకుని ఆర్టిస్టులను వంచించే వారిపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. సభ్యత్వం కోరుకునే వారు నేరుగా అసోసియేషన్ కార్యాలయాన్ని సంప్రదించాలని లేదా అధికారిక సమాచారాన్ని ధృవీకరించుకోవాలని సూచించారు. ఎవరైనా డబ్బుల కోసం ఒత్తిడి చేస్తే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని అసోసియేషన్ కోరింది.

Next Story