- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఐఐసీటీలో నాలుగు అత్యాధునిక పరిశోధన కేంద్రాల ప్రారంభం..
హైదరాబాద్‌లోని సీఎస్‌ఐఆర్–ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ (ఐఐసీటీ) లో నాలుగు అత్యాధునిక పరిశోధనా కేంద్రాలను కేంద్ర శాస్త్ర సాంకేతిక, భూవిజ్ఞాన శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర బాధ్యత) డా. జితేంద్ర సింగ్ మంగళవారం ప్రారంభించారు.

దిశ, సికింద్రాబాద్ : దేశంలో శాస్త్ర సాంకేతిక పరిశోధనలకు ఊతమిచ్చే దిశగా హైదరాబాద్‌లోని సీఎస్‌ఐఆర్–ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ (ఐఐసీటీ) లో నాలుగు అత్యాధునిక పరిశోధనా కేంద్రాలను కేంద్ర శాస్త్ర సాంకేతిక, భూవిజ్ఞాన శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర బాధ్యత) డా. జితేంద్ర సింగ్ మంగళవారం ప్రారంభించారు. అదే సందర్భంగా 200 మంది పరిశోధక విద్యార్థులకు వసతి కల్పించే ఆధునిక హాస్టల్ భవనానికి శంకుస్థాపన చేశారు. ప్రారంభించిన కొత్త పరిశోధనా కేంద్రాల్లో అధునాతన ఫ్లోరోకెమికల్స్ ఆర్‌అండ్‌డీ ఫెసిలిటీ, వస్త్ర పరిశ్రమ వ్యర్థజలాల శుద్ధి కేంద్రం, కంటిన్యూయస్ ప్రాసెసింగ్ టెక్నాలజీస్ ఫెసిలిటీ, సస్టైనబుల్ ఇంజినీరింగ్ కాంప్లెక్స్ ఉన్నాయి. ఈ కేంద్రాలు ఔషధాలు, ప్రత్యేక రసాయనాలు, పర్యావరణ పరిరక్షణ, పారిశ్రామిక సాంకేతికత అభివృద్ధికి కీలకంగా నిలవనున్నాయి.
ఈ సందర్భంగా కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ మాట్లాడుతూ వికసిత్ భారత్–2047 లక్ష్య సాధనలో శాస్త్ర సాంకేతిక రంగం కీలక పాత్ర పోషిస్తోందన్నారు. దేశాన్ని సాంకేతికంగా స్వావలంబన దిశగా తీసుకెళ్లేందుకు పరిశోధనా సంస్థలు వినూత్న ఆవిష్కరణల పై దృష్టి సారించాలని సూచించారు. పరిశ్రమలకు ఉపయోగపడే సాంకేతికత అభివృద్ధి, స్టార్టప్‌ల ప్రోత్సాహం, మేధోసంపత్తి హక్కుల సృష్టిలో ఐఐసీటీ విశేష కృషి చేస్తోందని అభినందించారు. అనంతరం ఐఐసీటీ డైరెక్టర్ డా. డి. శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ గత ఎనిమిది దశాబ్దాలుగా సంస్థ దేశ అభివృద్ధికి తోడ్పడే పరిశోధనలు చేపడుతోందన్నారు. కొత్త పరిశోధనా వసతులతో సంస్థ పరిశోధనా సామర్థ్యం మరింత బలోపేతం అవుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీఎస్‌ఐఆర్‌కు చెందిన వివిధ ప్రయోగశాలల డైరెక్టర్లు, ప్రముఖ శాస్త్రవేత్తలు, పరిశ్రమల ప్రతినిధులు, పరిశోధకులు, విద్యార్థులు పాల్గొన్నారు.






