- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పార్లమెంట్‌ను కుదిపేస్తున్న 'ఫోర్ స్టార్స్ ఆఫ్ డెస్టినీ'.. ఒక పుస్తకం ఎన్నెన్నో వివాదాలు
మాజీ ఆర్మీ చీఫ్ జనరల్ ఎం.ఎం. నరవణే తన జ్ఞాపకాలతో రాసిన 'ఫోర్ స్టార్స్ ఆఫ్ డెస్టినీ' అనే ఈ పుస్తకం ఇప్పుడు అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధానికి కేంద్ర బిందువుగా మారింది.

దిశ, వెబ్ డెస్క్: భారత పార్లమెంట్ లోని లోక్ సభ, రాజ్యసభలను ఒక పుస్తకం కుదిపేస్తుంది. 2026 బడ్జెట్ సమావేశాల్లో భాగంగా భారత రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానం సమయంలో ఎల్ఓపీ రాహుల్ గాంధీ 'ఫోర్ స్టార్స్ ఆఫ్ డెస్టినీ' పుస్తకంలోని ఒక అంశాన్ని సభలో ప్రస్తావించారు. దీంతో సభలో వివాదం నెలకొంది. అధికారికంగా ముద్రణ కానీ పుస్తకాన్ని సభలో ప్రస్తావించ కూడదని లోక్ సభ వ్యవహారాల మంత్రి స్పష్టం చేయగా.. అందులో ఉన్నది వాస్తవాలని, దీనిపై సభలో చర్చించాల్సిన అవసరం ఉందని రాహుల్ గాంధీతో పాటు ప్రతిపక్షాలు పట్టుబట్టాయి. దీంతో గత మూడు రోజులుగా లోక్ సభ వాయిదాలతోనే ముగుస్తుంది. దీంతో ప్రస్తుతం బడ్జెట్ సమావేశాల్లో ఏ బిల్లు గురించి జరగనంత చర్చ ఒక 'అప్రచురిత' (Unpublished) పుస్తకంపై జరుగుతోంది. మాజీ ఆర్మీ చీఫ్ జనరల్ ఎం.ఎం. నరవణే తన జ్ఞాపకాలతో రాసిన 'ఫోర్ స్టార్స్ ఆఫ్ డెస్టినీ' అనే ఈ పుస్తకం ఇప్పుడు అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధానికి కేంద్ర బిందువుగా మారింది.
వివాదానికి కేంద్రం ఎవరు?
ఈ పుస్తకాన్ని భారత మాజీ సైన్యాధిపతి జనరల్ ఎం.ఎం. నరవణే రచించారు. 2019 నుండి 2022 వరకు ఆయన ఆర్మీ చీఫ్‌గా పనిచేసిన కాలంలో జరిగిన కీలక పరిణామాలను ఇందులో పొందుపరిచారు. అయితే, రక్షణ శాఖ నుంచి దీనికి ఇంకా క్లియరెన్స్ లభించకపోవడంతో ఈ పుస్తకం ఇంకా మార్కెట్లోకి విడుదల కాలేదు. లోక్‌సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ, రాజ్యసభలో మల్లికార్జున ఖర్గే ఈ పుస్తకంలోని అంశాలను ప్రస్తావించడానికి ప్రయత్నించడంతో సభలో గందరగోళం నెలకొంది.
ఈ పుస్తకం ఎందుకు వివాదాస్పదంగా మారిందంటే
భారత సరిహద్దు ప్రాంతం అయిన లడాక్ సరిహద్దులో 2020లో చైనాతో జరిగిన గల్వాన్ లోయ ఘర్షణల సమయంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై ఈ పుస్తకంలో సంచలన వ్యాఖ్యలు ఉన్నట్లు తెలుస్తోంది. ఆ సమయంలో ప్రధాని మోదీ, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ వ్యవహరించిన తీరును ఇది ప్రశ్నిస్తోందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. సైన్యంలో రిక్రూట్‌మెంట్ కోసం తీసుకొచ్చిన 'అగ్నిపథ్' పథకం గురించి కూడా ఇందులో కీలక అంశాలు ఉన్నట్లు సమాచారం.
ఇదిలా ఉంటే లోక్ సభ రూల్స్ ప్రకారం.. అచ్చు కాని, ధృవీకరించని పుస్తకం నుండి విషయాలను పార్లమెంట్‌లో ప్రస్తావించడం నిబంధనలకు విరుద్ధమని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, అమిత్ షా తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేశారు. స్పీకర్ ఓం బిర్లా రూల్ 349ని ఉటంకిస్తూ, అధికారికంగా ప్రచురించని, సభ ముందు లేని పుస్తకాల నుండి ప్రసంగాల్లో భాగాలను చదవడం అనుమతించబోమని స్పష్టం చేశారు. కానీ, ఇప్పటికే ఒక మ్యాగజైన్‌లో ఈ పుస్తకంలోని కొన్ని భాగాలు వచ్చాయని, అవి ప్రజలందరికీ అందుబాటులో ఉన్నాయని విపక్షాలు వాదిస్తున్నాయి.
ఈ నేపథ్యంలో గత మూడు రోజులుగా లోక్ సభలో గందరగోళం నెలకొంది. అలాగే 8 మంది ఎంపీలు సభ నుంచి పూర్తి సెషన్ మొత్తానికి సస్పెండ్ అయ్యారు. మరి చివరగా ఈ వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో తెలియాలంటే వేచి చూడాల్సిందే. మొత్తానికి, ఒక సైనికాధికారి తన అనుభవాలను అక్షరబద్ధం చేసిన ఈ పుస్తకం, ఇప్పుడు దేశ రాజకీయాల్లో సెక్యూరిటీ, పారదర్శకతపై పెద్ద చర్చకు దారితీసింది.






