యమునా నదిలో కొట్టుకుపోయిన నలుగురు మైనర్లు.. రెండు మృతదేహాలు లభ్యం

by Malleboina Mahesh |

ఢిల్లీలో యమునా నదిలో స్నానానికి దిగి నలుగురు బాలురు గల్లంతు.. ఇద్దరి మృతదేహాలు లభ్యం, రెండో రోజు కొనసాగుతున్న ఎన్డీఆర్ఎఫ్ గాలింపు చర్యలు!

యమునా నదిలో కొట్టుకుపోయిన నలుగురు మైనర్లు.. రెండు మృతదేహాలు లభ్యం
X

దిశ, వెబ్ డెస్క్: దేశ రాజధాని ఢిల్లీలో తీవ్ర విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఔటర్ నార్త్ జిల్లాలోని అలీపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గల హీరాంకి గ్రామం వద్ద, యమునా నదిలో స్నానానికి దిగిన నలుగురు మైనర్ బాలురు నదీ ప్రవాహానికి కొట్టుకుపోయాడు. ఆదివారం సాయంత్రం జరిగిన ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న ఢిల్లీ ఫైర్ సర్వీస్, ఎన్డీఆర్ఎఫ్ (NDRF), డీడీఎంఏ (DDMA) స్థానిక పోలీసులు రంగంలోకి దిగి ఉమ్మడిగా భారీ రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు.

రెండు మృతదేహాలు లభ్యం

ఆదివారం రాత్రి నిర్వహించిన గాలింపు చర్యలలో ఇద్దరు బాలుర మృతదేహాలను సహాయక బృందాలు వెలికితీశాయి. అయితే రాత్రి 10:30 గంటల సమయంలో చీకటి పడటంతో వాతావరణం అనుకూలించక శోధనను తాత్కాలికంగా నిలిపివేశారు. కాగా, మిగిలిన ఇద్దరు బాలుర కోసం సోమవారం ఉదయం నుంచి రెస్క్యూ ఆపరేషన్ ముమ్మరంగా కొనసాగుతోంది. నదిలో ప్రవాహం బలంగా ఉండటంతో గాలింపు చర్యలకు కొంత ఆటంకం కలుగుతోంది. ఇప్పటివరకు సోమవారం నాటి గాలింపులో ఎలాంటి మృతదేహాలు లభ్యం కాలేదు. ఈ ప్రమాదంలో కొట్టుకుపోయి ఇంకా లభ్యం కాని ఒక 15 ఏళ్ల బాలుడి తల్లి మీడియాతో మాట్లాడుతూ.. "నేను రోజువారీ పనిలో ఉన్న సమయంలో నా కుటుంబ సభ్యులు ఫోన్ చేసి, నా కొడుకు యమునా నదిలో మునిగిపోయాడని చెప్పారు" అంటూ కన్నీరుమున్నీరుగా విలపించింది. నలుగురు చిన్నారులు నదిలోకి దిగి ప్రాణాలు కోల్పోవడంతో హీరాంకి గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి.

Next Story