జిల్లాలో ఈఎస్ఐ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిని ఏర్పాటు చేయాలి.. కార్మిక శాఖ మంత్రికి ఐఎన్‌టీయూసీ వినతి

by Jakkula.Mamatha |

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అత్యాధునిక పరీక్షలు, సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలతో కూడిన ఈఎస్ఐ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిని తక్షణమే ఏర్పాటు చేయాలని ఐఎన్‌టీయూసీ, మిత్రపక్షాల కార్మిక సంఘాలు సంయుక్తంగా రాష్ట్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామికి విజ్ఞప్తి చేశాయి.

జిల్లాలో ఈఎస్ఐ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిని ఏర్పాటు చేయాలి.. కార్మిక శాఖ మంత్రికి ఐఎన్‌టీయూసీ వినతి
X

దిశ,బూర్గంపాడు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అత్యాధునిక పరీక్షలు, సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలతో కూడిన ఈఎస్ఐ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిని తక్షణమే ఏర్పాటు చేయాలని ఐఎన్‌టీయూసీ, మిత్రపక్షాల కార్మిక సంఘాలు సంయుక్తంగా రాష్ట్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామికి విజ్ఞప్తి చేశాయి. ఈ మేరకు హైదరాబాద్‌లో మంత్రిని కలిసి కార్మిక ప్రతినిధులు ఒక సమగ్ర వినతి పత్రాన్ని సమర్పించారు. తెలంగాణలోనే ప్రముఖ పారిశ్రామిక హబ్‌గా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా విరాజిల్లుతోందని వినతిపత్రంలో పేర్కొన్నారు. జిల్లాలో ఐటీసీ లిమిటెడ్ – పీఎస్‌పీడీ (సారపాక), నవభారత్ వెంచర్స్, కేటీపీఎస్,బీటీపీఎస్, హెవీ వాటర్ ప్లాంట్, సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్, ఆయిల్ పామ్ ప్రాసెసింగ్ యూనిట్లతో పాటు వందలాది చిన్న, మధ్యతరహా, సూక్ష్మ పరిశ్రమలు నడుస్తున్నాయని, వీటిపై ఆధారపడి వేలాది మంది కార్మిక కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయని తెలిపారు.​

ప్రతి నెల ఈ పరిశ్రమల ద్వారా ఈఎస్ఐ కార్పొరేషన్‌కు కోట్లాది రూపాయల కాంట్రిబ్యూషన్ చెల్లించబడుతోందని, ఒక్క ఐటీసీ భద్రాచలం యూనిట్ నుంచే సుమారు 7,000 మంది కార్మికులు(ఇన్సూర్డ్ పర్సన్స్) ఉండగా,వారి కుటుంబసభ్యులతో కలిపి దాదాపు 32,000 మంది లబ్ధిదారులు ఉన్నారని పేర్కొన్నారు. ఐటీసీ సంస్థ ద్వారా ఏడాదికి దాదాపు రూ. 3.50 కోట్ల ఈఎస్ఐ చందా అందుతోంది. సింగరేణి,విద్యుత్ ఉత్పత్తి సంస్థల నుంచి కూడా భారీగా నిధులు సమకూరుతున్నాయని పేర్కొన్నారు.​ఇంత భారీ స్థాయిలో ఈఎస్ఐ నిధులు సమకూరుతున్నప్పటికీ, స్థానికంగా కార్మికులకు అవసరమైన స్థాయిలో అత్యవసర వైద్య సేవలు అందుబాటులో లేకపోవడం అత్యంత విచారకరమని నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. గుండె సంబంధిత వ్యాధులు, కిడ్నీ వ్యాధులు, క్యాన్సర్,ప్రమాదాలు సంభవించినప్పుడు లేదా ప్రసూతి, ఐసీయూ చికిత్సలు అవసరమైనప్పుడు కార్మికులు ఖమ్మం, వరంగల్, హైదరాబాద్ వంటి దూర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తోందని, దీనివల్ల ప్రాణనష్టం కూడా జరుగుతోందని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. బూర్గంపాడు మండలంలో ఆసుపత్రి నిర్మాణానికి అవసరమైన ప్రభుత్వ (రెవెన్యూ)భూమిని కేటాయిస్తే, ఐటీసీ లిమిటెడ్ – పీఎస్‌పీడీ భద్రాచలం యూనిట్ తమ కార్పొరేట్ సామాజిక బాధ్యత నిధుల ద్వారా ఆసుపత్రి భవన నిర్మాణానికి సానుకూలంగా స్పందించడానికి సిద్ధంగా ఉందని వినతిపత్రంలో వివరించారు.

కార్మిక సంఘాల డిమాండ్లు..

​భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 24 గంటల అత్యవసర సేవలు, ఐసీయూ, కార్డియాలజీ, నెఫ్రాలజీ, ఆర్థోపెడిక్స్, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, ప్రసూతి-స్త్రీ రోగ విభాగం, శిశు వైద్యం, క్యాన్సర్ చికిత్స వంటి సూపర్ స్పెషాలిటీ విభాగాలతో ఈఎస్ఐ ఆసుపత్రిని మంజూరు చేయాలి. బూర్గంపాడు మండలంలో ఆసుపత్రికి అవసరమైన రెవెన్యూ భూమిని తక్షణమే కేటాయించాలి. ​ఈ ఆసుపత్రి ఏర్పాటు ద్వారా భద్రాద్రి కొత్తగూడెం మాత్రమే కాకుండా పరిసర జిల్లాలకు చెందిన లక్షలాది మంది కార్మిక కుటుంబాలకు నాణ్యమైన వైద్యం అందుతుందని స్పష్టం చేశారు. కార్మికుల న్యాయమైన ఈ డిమాండ్‌పై సానుకూలంగా స్పందించి,సంబంధిత శాఖలకు తగిన ఆదేశాలు జారీ చేయాలని ఐఎన్‌టీయూసీ భద్రాచలం పేపర్ బోర్డ్స్ ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్షులు గిరి రామారావు, ప్రధాన కార్యదర్శి యారం పిచ్చిరెడ్డి తదితరులు మంత్రి వివేక్ వెంకటస్వామిని కోరారు. ఈ విషయమై సానుకూలంగా స్పందించిన మంత్రి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

Next Story