MP Chamala: కేటీఆర్ అనే పేరు వెనుక అసలు కథ ఇదే..

by Gantepaka Srikanth |

తెలంగాణ రాజకీయాల్లో అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం మొదిరింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై భువనగిరి లోక్‌సభ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

MP Chamala: కేటీఆర్ అనే పేరు వెనుక అసలు కథ ఇదే..
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ రాజకీయాల్లో అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం మొదిరింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై భువనగిరి లోక్‌సభ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తెలంగాణలో రక్తదాహం, అధికార దాహం, ధన దాహం ఎవరికి ఉందో ఇక్కడి ప్రజలకు బాగా తెలుసంటూ కేటీఆర్‌కు గట్టి కౌంటర్ ఇచ్చారు. పదేళ్ల పాటు సాగిన బీఆర్ఎస్ అరాచకాలను చూసే ప్రజలు గత ఎన్నికల్లో వారిని ఇంటికి పంపించారని ఎంపీ చామల ఎద్దేవా చేశారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, సోనియా గాంధీ అని ఎంపీ చామల స్పష్టం చేశారు. ‘తెలంగాణలో బలిదానాలకు కారకులు ఎవరో నీ పక్కనే ఉన్న నీ బావ హరీష్ రావును అడుగు నిజాలు తెలుస్తాయి’ అని కేటీఆర్‌కు సూచించారు. తెలంగాణ వస్తే దళితుడిని ముఖ్యమంత్రి చేస్తానని, రాష్ట్రానికి వాచ్ మెన్‌గా ఉంటానని చెప్పిన కేసీఆర్.. ఇచ్చిన మాటను ఎందుకు తప్పారని నిలదీశారు.

కేటీఆర్ అనే పేరు వెనుక అసలు కథ ఇదే..

తెలంగాణ ఉద్యమంలో అసలు కేటీఆర్ ఎక్కడున్నారని చామల కిరణ్ కుమార్ రెడ్డి ప్రశ్నించారు. ఉద్యమకారుడైన కె.కె. మహేందర్ రెడ్డి పొట్టగొట్టి కేటీఆర్‌కు సిరిసిల్ల టికెట్ ఇచ్చారని ఆరోపించారు. గతంలో తెలుగుదేశం పార్టీలో ఎమ్మెల్యే టికెట్ కోసం కేసీఆర్ తన కొడుకు అసలు పేరు 'అజయ్ రావును కాస్తా 'కేటీఆర్'గా మార్చారని సంచలన వ్యాఖ్యలు చేశారు. మంత్రి పదవి రాలేదనే కారణంతోనే కేసీఆర్ నాడు టీడీపీ నుంచి బయటకు వచ్చారని.. కేవలం కలెక్షన్లు, కమీషన్లు, ఎన్నికలతోనే టైమ్ పాస్ చేశారని విమర్శించారు. ఉద్యమ సమయంలో ప్రొఫెసర్ జయశంకర్ సార్‌ను 'తెలంగాణ జాతిపిత' అన్న కేసీఆర్.. 2014లో సీఎం కాగానే నేనే జాతిపితను అంటూ డబ్బా కొట్టుకున్నారని మండిపడ్డారు. అధికారంలోకి వచ్చాక తెలంగాణ నిరుద్యోగులను ముంచి, తన ఇంట్లోనే ఐదు, ఆరు ఉద్యోగాలు ఇచ్చుకున్నారని ధ్వజమెత్తారు. రూ.లక్ష కోట్లు పెట్టి కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు ఏమైందో తెలంగాణ ప్రజలందరికీ తెలుసన్నారు. పదేళ్లలో బ్యారేజీలు అంత మంచిగా కడితే ఇప్పుడు నీళ్లు ఎందుకు రావడం లేదని, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (NDSA) ఏం చెప్పిందో కేటీఆర్కు తెలియదా అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ హయాంలో ఒక్క దక్షిణ తెలంగాణ ప్రాజెక్టును కూడా పూర్తి చేయలేదని ఆరోపించారు. కేసీఆర్ దోపిడీ వల్ల తెలంగాణ 'పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టు' అయిందని.. ఈ 10 ఏళ్లలో రాష్ట్రాన్ని రూ.8 లక్షల కోట్ల అప్పుల్లో ముంచారని మండిపడ్డారు. కేసీఆర్ కుటుంబం చేసిన దోపిడీని ప్రజలు గమనించే తెలంగాణ నడిబొడ్డున పార్టీ పేరును (TRS నుండి BRSగా మార్చుకున్నారని ఎద్దేవా చేశారు.

బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటే.. ఆ సీక్రెట్ అదే..

తెలంగాణలో బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు ఒక్కటేనని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. ఈటల రాజేందర్‌ను మల్కాజిగిరి ఎంపీగా గెలిపించింది బీఆర్ఎస్సేనని వ్యాఖ్యానించారు. అందుకే కృతజ్ఞతగా ఈటల బీఆర్ఎస్‌కు పాజిటివ్‌గా మాట్లాడుతున్నారని అన్నారు. తెలంగాణలో బీజేపీకి 8 ఎంపీ సీట్లు ఎలా వచ్చాయో ఇక్కడి ప్రజలకు అంతా తెలుసన్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసును ప్రస్తావిస్తూ.. వాతాల్లో తేడా వచ్చేసరికి కవిత బయటకు వచ్చారు" అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. నాడు తెలంగాణ ఇచ్చినందుకు ఢిల్లీకి వెళ్లి సోనియా గాంధీ కాళ్లు మొక్కి వచ్చింది కేసీఆర్ కుటుంబం మొత్తం కాదా? అని గుర్తు చేశారు. ఇప్పటికైనా కేటీఆర్ బట్టకాల్చి మీదేసే రాజకీయం మానుకోవాలని, సీఎం రేవంత్ రెడ్డి చేసే ప్రతీ మంచి పనిని అడ్డుకుంటూ తెలంగాణ ప్రజలను తప్పుదోవ పట్టించవద్దని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి గట్టిగా హెచ్చరించారు.

Next Story