సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి చుక్కెదురు

by Malleboina Mahesh |

పోలవరం, బనకచర్లపై తెలంగాణ పిటిషన్‌లో లోపాలు.. ఏపీకి నోటీసులు, ఇంజెక్షన్ ఆర్డర్స్ ఇవ్వడానికి నిరాకరించిన సుప్రీంకోర్టు.

సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి చుక్కెదురు
X

దిశ, వెబ్ డెస్క్: సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి చుక్కెదురైంది. అంతర్రాష్ట్ర జల వివాదాలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు (Supreme Court)లో విచారణ జరిగింది. పోలవరం ప్రాజెక్టు, కృష్ణా నీటి వినియోగం, బనకచర్ల క్రాస్ రెగ్యులేటర్ అంశాలపై తెలంగాణ దాఖలు చేసిన ఈ పిటిషన్‌ను జస్టిస్ విక్రమ్‌నాథ్ నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది. అయితే ఈ విచారణలో తెలంగాణ ప్రభుత్వానికి న్యాయస్థానంలో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. విచారణ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. ఈ కేసులో మొత్తం 15 మంది ప్రతివాదులు ఉన్నారని, ఏపీ ప్రభుత్వం చేపడుతున్న పనులపై తక్షణమే స్టే (ఇంజెక్షన్ ఉత్తర్వులు) ఇవ్వడంతో పాటు నోటీసులు జారీ చేయాలని అభ్యర్థించారు.

అయితే, తెలంగాణ దాఖలు చేసిన ప్రధాన పిటిషన్‌లో తీవ్ర సాంకేతిక లోపాలు ఉన్నాయని జస్టిస్ విక్రమ్‌నాథ్ ధర్మాసనం వేలెత్తి చూపింది. పిటిషన్‌లోని ఆ లోపాలను పూర్తిగా సరిదిద్దే వరకు ఎలాంటి క్షేత్రస్థాయి విచారణ చేపట్టడం కుదరదని స్పష్టం చేసింది. తొలుత ఆ లోపాలను సరిదిద్దిన తర్వాతే విచారణలో మిగతా అంశాలను పరిశీలిస్తామని కోర్టు తేల్చి చెప్పింది. పిటిషన్‌ను విచారణకు స్వీకరించకుండా, ప్రాథమిక లోపాలు ఉన్న స్థితిలో ఏపీ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేయడం కానీ, ఇంజెక్షన్ ఉత్తర్వులు ఇవ్వడం కానీ అస్సలు కుదరదని సుప్రీంకోర్టు స్పష్టం చేస్తూ తదుపరి విచారణను వాయిదా వేసింది.

Next Story