- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మక్తల్–నారాయణపేట నాలుగు లైన్ల రహదారికి శంకుస్థాపన
మారుమూల గ్రామాలు, తండాలకు కూడా మెరుగైన రహదారి సౌకర్యాలు కల్పించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు.

దిశ, మక్తల్ : మారుమూల గ్రామాలు, తండాలకు కూడా మెరుగైన రహదారి సౌకర్యాలు కల్పించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. ప్రజల అవసరాల దృష్ట్యా రాష్ట్రవ్యాప్తంగా కోట్లాది రూపాయలతో రహదారుల అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు తెలిపారు. సోమవారం మక్తల్‌లో రాష్ట్ర పశుసంవర్ధక, పాడి పరిశ్రమాభివృద్ధి, మత్స్య, యువజన సర్వీసులు & క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావు పాల్గొన్నారు. వారికి ఘన స్వాగతం పలికిన అనంతరం టోల్‌గేట్ నుంచి సభా ప్రాంగణం వరకు సుమారు ఆరు కిలోమీటర్ల మేర భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు.
అనంతరం మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి, ఎమ్మెల్యేలు యెన్నం శ్రీనివాస్‌రెడ్డి, వీర్లపల్లి శంకర్, జిల్లా కలెక్టర్ ప్రియాంకతో కలిసి రూ.237 కోట్ల వ్యయంతో నిర్మించనున్న మక్తల్–నారాయణపేట నాలుగు లైన్ల హ్యామ్ రహదారికి శంకుస్థాపన చేసి పైలాన్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ.. మంత్రి వాకిటి శ్రీహరి తన నియోజకవర్గ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తూ మక్తల్–నారాయణపేట నాలుగు లైన్ల రహదారి మంజూరు అయ్యే వరకు పట్టుదలతో ప్రయత్నించారని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని ఒప్పించి ఈ ప్రాజెక్టుకు నిధులు మంజూరు చేయించారని పేర్కొన్నారు. రహదారి విస్తరణకు అవసరమైన భూసేకరణ నిధుల విషయంలో ప్రభుత్వం వెనుకాడదని, జిల్లా యంత్రాంగం పూర్తి సహకారం అందించాలని సూచించారు.
మంత్రి వాకిటి శ్రీహరి మాట్లాడుతూ, మక్తల్ నియోజకవర్గంలో ప్రారంభమైన ఈ రహదారి నిర్మాణ పనులు చారిత్రాత్మకమైనవని అన్నారు. ప్రజల అవసరాలకే ప్రాధాన్యం ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఈ భారీ రహదారి ప్రాజెక్టును మంజూరు చేసిందన్నారు. ఎన్నో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న మక్తల్–నారాయణపేట రహదారి నిర్మాణానికి ప్రస్తుతం కార్యరూపం దాల్చడం ఆనందదాయకమని చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో రహదారుల అభివృద్ధిని నిర్లక్ష్యం చేశారని, నాసిరకం రోడ్ల కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని విమర్శించారు. ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి నాయకత్వంలో ప్రజల రవాణా కష్టాలు తొలగించాలనే సంకల్పంతో రూ.237 కోట్లతో ఈ నాలుగు లైన్ల రహదారిని ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు.
మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ, మక్తల్ నియోజకవర్గ అభివృద్ధికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, సంబంధిత మంత్రులు వెంటనే స్పందిస్తూ అవసరమైన నిధులు మంజూరు చేస్తున్నారని తెలిపారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ప్రజలకు ఇచ్చిన హామీల అమలులో ప్రభుత్వం వెనుకడుగు వేయడం లేదన్నారు. రైతులకు పెట్టుబడి సాయం, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, సాగు–తాగునీటి ప్రాజెక్టులు, మౌలిక వసతుల అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని పేర్కొన్నారు. ఎన్నో ఏళ్లుగా వెనుకబడిన మక్తల్ నియోజకవర్గం ప్రస్తుతం అభివృద్ధి బాటలో ముందుకు సాగుతోందని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మండల అధ్యక్షులు, సర్పంచులు, మున్సిపల్ చైర్మన్లు, ప్రజాప్రతినిధులు, సంబంధిత శాఖల అధికారులు, పార్టీ నాయకులు, పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.






