ఆరు హత్యల కేసులో పెను సంచలనం.. నిందితుడు రాజ్‌కుమార్ ఆత్మహత్య

by Kema Shiva Kumar |   (  Updated:2026-07-13 11:18:20  IST  )

తెలంగాణలో సంచలనం సృష్టించిన షాబాద్ ఆరు హత్యల కేసు ప్రధాన నిందితుడు రాజ్‌కుమార్ కథ విషాదాంతమైంది.

ఆరు హత్యల కేసులో పెను సంచలనం.. నిందితుడు రాజ్‌కుమార్ ఆత్మహత్య
X

దిశ, వెబ్‌డెస్క్: రంగారెడ్డి జిల్లా షాబాద్‌ మండల పరిధిలోని దైవాలగూడ గ్రామంలో ఒకే రాత్రి ఆరుగురిని కిరాతకంగా నరికి చంపి, రాష్ట్రవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన ప్రధాన నిందితుడు రాజ్‌కుమార్ కథ విషాదాంతమైంది. గత రెండు రోజులుగా పోలీసుల కళ్లుగప్పి పరారీలో ఉన్న రాజ్‌కుమార్ చివరకు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. షాద్‌నగర్ నియోజకవర్గ పరిధిలోని కొత్తూరు మండల పరిధిలోని పంజర్ల గ్రామ శివారు వెంచర్‌లో అతడి మృతదేహం లభ్యమవడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

ఘటనా స్థలంలో పాయిజన్ బాటిల్..

పోలీసుల కథనం ప్రకారం.. పంజర్ల గ్రామ శివారు ప్రాంతంలో ఒక వ్యక్తి మృతదేహం పడి ఉండటాన్ని గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతుడిని షాబాద్ నరమేధం కేసులో మోస్ట్ వాంటెడ్ నిందితుడిగా ఉన్న రాజ్‌కుమార్‌గా గుర్తించారు. మృతదేహం పక్కనే పాయిజన్ బాటిల్ లభ్యం కావడంతో, పోలీసుల వేట తీవ్రమవ్వడం, ఎటూ తప్పుకుపోయే అవకాశం లేకపోవడంతో అతడు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు.

మేనమామ ఊరిలో బలవన్మరణం

అయితే, హత్యలు జరిగిన తర్వాత నిందితుడిని పట్టుకునేందుకు ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ పోలీసులు సుమారు 12 ప్రత్యేక బృందాలతో విస్తృతంగా గాలింపు చేపట్టారు. అంతేకాకుండా అతడి ఆచూకీ తెలిపిన వారికి రూ.2 లక్షల నగదు బహుమతిని కూడా ప్రకటించారు. పోలీసుల గాలింపు తీవ్రమవడంతో ఎక్కడా ఆశ్రయం దొరకక, చివరకు కొత్తూరు మండలంలోని తన మేనమామ ఊరైన పంజర్లకు రాజ్‌కుమార్ చేరుకున్నాడు. అక్కడే గ్రామ శివారులోకి వెళ్లి విషం తాగి ప్రాణాలు తీసుకున్నాడు. తనపై పోక్సో కేసు పెట్టారనే కక్షతో కన్నబిడ్డలు, భార్యతో సహా ఆరుగురిని పొట్టనబెట్టుకున్న కిరాతకుడు.. చివరకు ఇలా పాయిజన్ తాగి శవమై తేలడంతో కేసు దాదాపు ముగిసినట్లయింది. ఈ మేరకు పోలీసులు రాజ్‌కుమార్ కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వగా వారు ఒక్కొక్కరుగా స్పాట్‌కు చేరుకుంటున్నారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించనున్నారు. మరోవైపు దాడులు, ఆందోళనలను జరగవచ్చనే అంచనాతో పోలీసులు అప్రమత్తమయ్యాయి భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.

Next Story