- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
షోకాజ్ నోటీసుకు భయపడేది లేదు : మాజీ సర్పంచ్ బేరి ఈశ్వర్
డీసీసీ అధ్యక్షుడు జంగయ్య యాదవ్ ఇచ్చిన షోకాజ్ నోటీసుకు భయపడేది లేదని మాజీ సర్పంచ్ బేరి ఈశ్వర్ స్పష్టం చేశారు.

దిశ, మేడ్చల్ : డీసీసీ అధ్యక్షుడు జంగయ్య యాదవ్ ఇచ్చిన షోకాజ్ నోటీసుకు భయపడేది లేదని మాజీ సర్పంచ్ బేరి ఈశ్వర్ స్పష్టం చేశారు. పార్టీ విలువలు దిగజార్చే విధంగా బేరి ఈశ్వర్ వ్యవహరించారంటూ డీసీసీ అధ్యక్షుడు జంగయ్య యాదవ్ శనివారం జారీ చేసిన షోకాజ్ నోటీసు పై బేరి ఈశ్వర్ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను ఎక్కడా పార్టీ విలువలు దిగజార్చే విధంగా వ్యవహరించలేదని, పార్టీ అంతర్గత విషయాలు బయటకు వచ్చాయని, తాను సూచన మాత్రమే చేశానని తెలిపారు. ఆ విషయాలను సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేసింది కూడా జంగయ్య యాదవ్ మోచేతి నీళ్లు తాగే వారేనని ఆరోపించారు. దానిని మాట్లాడుకుని సరిచేసుకోవాల్సింది పోయి తనకు నోటీసు ఇవ్వడం విడ్డూరంగా ఉందన్నారు.
తాను కూడా పార్టీలో సీనియర్ నాయకుడినేనని, ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదన్నారు. జిల్లా అధ్యక్షుడిగా ఉండి కూడా నాయకులతో ఎలా మాట్లాడాలో తెలియకపోవడం సిగ్గుచేటన్నారు. కాంగ్రెస్ పార్టీ స్వాతంత్ర్యానికి పూర్వం నుంచే ఉందని, పార్టీకి విధివిధానాలు ఉన్నాయని, ఆ విషయం జిల్లా అధ్యక్షుడికి తెలియకపోవడం శోచనీయమన్నారు. జిల్లా అధ్యక్షుడికి షోకాజ్ నోటీసు ఇచ్చే అధికారం లేదని, క్రమశిక్షణ చర్యలు తీసుకునే అధికారం కేవలం పార్టీ క్రమశిక్షణ సంఘానికే ఉంటుందని తెలిపారు. ఈ విషయాన్ని క్రమశిక్షణ సంఘం చైర్మన్ మల్లు రవి వద్దే తేల్చుకుంటానని బేరి ఈశ్వర్ స్పష్టం చేశారు. పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి అత్త ప్రశాంతి రెడ్డి పీసీసీ సభ్యురాలిగా ఉండి, తన నియోజకవర్గంలో పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన వారి పై డీసీసీ అధ్యక్షుడికి కాకుండా క్రమశిక్షణ సంఘం చైర్మన్‌కు ఫిర్యాదు చేశారని తెలిపారు. ఈ విషయం కూడా జిల్లా అధ్యక్షుడికి తెలియకపోవడం ఏమిటని ప్రశ్నించారు.
జిల్లా అధ్యక్షుడు ఇచ్చిన నోటీసుకు తాను ఎలాంటి వివరణ ఇవ్వబోనని స్పష్టం చేశారు. తాను కూడా జిల్లా అధ్యక్షుడి పై క్రమశిక్షణ సంఘానికి ఫిర్యాదు చేస్తానని తెలిపారు. జిల్లా అధ్యక్షుడి పై పలువురు ఆరోపణలు చేసినప్పటికీ వారికి నోటీసులు ఇవ్వకుండా, అణగారిన వర్గానికి చెందిన తనకే నోటీసు ఇవ్వడం పై ఆగ్రహం వ్యక్తం చేశారు. షోకాజ్ నోటీసు ఇచ్చి తనకు ఆయుధం ఇచ్చినట్టేనని, జిల్లా అధ్యక్షుడి పై చర్యల కోసం పోరాటం చేస్తానని బేరి ఈశ్వర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో 299 డివిజన్ అధ్యక్షుడు సురేందర్ ముదిరాజ్, జిల్లా obc సెల్ అధ్యక్షుడు రవి ముదిరాజ్, గడిల కృష్ణ రెడ్డి, ఆదిలక్ష్మి, విజయ్, కావేరి శేఖర్, అమరం సురేష్ రెడ్డి, సంపత్ రెడ్డి, రాఘవేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.






