- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఎంఐఎంపై భయమా? ప్రేమనా?.. రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని నిలదీసిన కిషన్ రెడ్డి
ఎంఐఎం ప్రయోజనాల కోసమే రేవంత్ సర్కార్ పని చేస్తోందని కిషన్ రెడ్డి విమర్శించారు. సామాన్యులపైనే హైడ్రా చర్యలు తీసుకుంటోందని మండిపడ్డారు.

దిశ, డైనమిక్ బ్యూరో: ఎంఐఎం ప్రయోజనాల కోసమే రేవంత్ రెడ్డి సర్కార్ పని చేస్తోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శలు గుప్పించారు. ఎంఐఎం అంటే భయమా? ప్రేమా? లేక రెండునా అని ప్రశ్నించారు. భూములు, రియల్ ఎస్టేట్ కమిషన్ల కక్కుర్తి కోసమే హైడ్రా పేరుతో పేదల పొట్ట కొడుతున్నారని మండిపడ్డారు. సామాన్యులపైనే హైడ్రా చర్యలు తీసుకుంటోందని, మజ్లిస్ నేతలపై హైడ్రా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని నిలదీశారు. ఇవాళ ఎక్స్ వేదికగా ఓ పోస్టు చేసిన కిషన్ రెడ్డి.. సల్కం చెరువు ఎఫ్‍టీఎల్, ఫాతిమా విద్యాసంస్థలపై కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదన్నారు.
రాజకీయ ప్రయోజనం కోసమే కలిసిపోయారు:
హైడ్రా కూల్చివేతల్లో పేద ముస్లింలు కూడా ఇండ్లు, జీవనోపాధి కోల్పోయి తీవ్రంగా నష్టపోయారు. ఆ పేద కుటుంబాల ఇళ్లను కూల్చివేస్తున్నప్పుడు అటు ఎంఐఎం కానీ, ఇటు కాంగ్రెస్ కానీ వారి తరఫున నిలబడలేదని కనీసం నిరసన కూడా తెలపలేదన్నారు. కానీ ఎంఐఎంకు సంబంధించిన ఆస్తుల విషయానికి వచ్చేసరికి మాత్రం ఈ రెండు పార్టీలు కలిసికట్టుగా నిలబడుతున్నాయని దీన్ని బట్టి వారికి ముస్లిం సమాజంపై ప్రేమ కంటే రాజకీయ ప్రయోజనాలే ముఖ్యమని స్పష్టమవుతోందని ఆరోపిస్తున్నారు. ఫాతిమా విద్యాసంస్థల ఎపిసోడ్ కాంగ్రెస్ ఓటు బ్యాంక్ రాజకీయం చేస్తే ఎంఐఎం ద్వంద్వ విధానం అనుసరిస్తోందన్నారు. మీ రాజకీయ ప్రయోజనాలకు ప్రజల ఆస్తులు తాకట్టు పెట్టవద్దన్నారు.
ఒకటే న్యాయం ఉండాలి:
పేదవాడికి బుల్డోజర్లు.. కాంగ్రెస్-మజ్లిస్ రాజకీయ కూటమికి రక్షణ అన్నట్లుగా ఈ ప్రభుత్వ ప్రాధాన్యతలు ఉన్నాయని కిషన్ రెడ్డి విమర్శించారు. ప్రభుత్వ భూములు, చెరువులు, వనరులు తెలంగాణ ప్రజల సొత్తే కానీ, రాజకీయ రక్షణలో ఉన్న కొందరి సొత్తు కాదని స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇకనైనా ఓటు బ్యాంక్, మతపరమైన కోణంలో పాలన సాగించడం ఆపి, తమ రాజకీయ మిత్రులను వెనకేసుకురావడం మానుకోవాలన్నారు. రాష్ట్రంలోని ప్రతి పౌరుడికి ‘ఒకే రాజ్యాంగం, ఒకే చట్టం, ఒకే న్యాయం’ వర్తింపజేయాలన్నారు. రాబోయే రోజుల్లో తెలంగాణ ప్రజలు ఈ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు.






