- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నిబంధనలన్నీ నీటిపాలే !
రియల్ ఎస్టేట్ రంగంలో ప్రముఖ సంస్థలుగా పేరుగాంచిన 'సుచిర్ ఇండియా', 'వాసవి నిర్మాణ్' సంస్థలు సంయుక్తంగా చేపట్టిన మెగా వెంచర్‌లో జరుగుతున్న భారీ అక్రమాలు అధికారిక విచారణలో బట్టబయలయ్యాయి.

దిశ, మేడ్చల్ బ్యూరో : రియల్ ఎస్టేట్ రంగంలో ప్రముఖ సంస్థలుగా పేరుగాంచిన 'సుచిర్ ఇండియా', 'వాసవి నిర్మాణ్' సంస్థలు సంయుక్తంగా చేపట్టిన మెగా వెంచర్‌లో జరుగుతున్న భారీ అక్రమాలు అధికారిక విచారణలో బట్టబయలయ్యాయి. నిబంధనలను గాలికొదిలేసి, ప్రకృతి ప్రసాదించిన చెరువులు, నాలాలను సైతం తమ స్వార్థ ప్రయోజనాల కోసం కబ్జా చేసిన విషయం జాయింట్ ఇన్‌స్పెక్షన్‌లో నిర్ధారణైంది. సుమారు 79.16 ఎకరాల విస్తీర్ణంలో చేపట్టిన ఈ లే అవుట్‌లో జరిగిన పర్యావరణ విధ్వంసం, అక్రమ నిర్మాణాల పై వివిధ ప్రభుత్వ శాఖలు కొరడా ఝుళిపించేందుకు సిద్ధమయ్యాయి. వరుసగా నోటీసులు జారీ చేస్తూ, ఏకంగా నీటిపారుదల శాఖ అనుమతులను రద్దు చేయడంతో పాటు ప్లాట్ల రిజిస్ట్రేషన్లను నిలిపివేస్తూ సంచలన నిర్ణయాలు తీసుకున్నాయి.
చెరువుల ఎఫ్‌టీఎల్, నాలాల ఆక్రమణ..
శామీర్‌పేట మండలం, కీసర మున్సిపల్ సర్కిల్ పరిధిలోని సహజసిద్ధమైన నీటి వనరులకు ఈ వెంచర్ తీవ్ర ముప్పుగా పరిణమించింది. గుండ్లకుంట చెరువుకు సంబంధించిన బఫర్ జోన్, ఎఫ్‌టీఎల్ పరిధిలోకి చొరబడి నిబంధనలకు విరుద్ధంగా సంస్థ ప్రతిష్ఠాత్మక క్లబ్ హౌస్, కాంపౌండ్ వాల్, విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ గదులను నిర్మించింది. దీనికి తోడు దేవరయాంజాల్ చెరువు (లేక్ ఐడీ: 1800/23), చిన్న బంధంకుంట, నల్లకుంట (లేక్ ఐడీ: 1800/31)లకు ఫీడర్ ఛానల్‌గా ఉన్న పోతాయిపల్లి చెరువు సర్ప్లస్ కోర్సులను ఇష్టారాజ్యంగా మళ్లించారు. ఇరిగేషన్ నిబంధనల ప్రకారం నాలాలను తగిన వెడల్పుతో కాంక్రీట్ నిర్మాణాలుగా అభివృద్ధి చేయాల్సి ఉండగా, ఆ స్థలాన్ని కూడా విక్రయించేందుకు వీలుగా నాలాలను కుదించి వాటిలో హ్యూమ్ పైపులు ఏర్పాటు చేశారు. దీనివల్ల భవిష్యత్తులో వరద నీరు వెనక్కి తన్ని ఎగువ ప్రాంతాలన్నీ జలదిగ్బంధంలో చిక్కుకునే ప్రమాదం ఉందని ఇరిగేషన్ అధికారులు తమ తనిఖీ నివేదికలో స్పష్టంగా పేర్కొన్నారు.
భారీ ఎత్తున సర్వే నంబర్లలో అక్రమాల పుట్ట..
మూడు గ్రామాల సరిహద్దుల్లో విస్తరించిన ఈ భారీ వెంచర్ మొత్తం వివాదాల మయంగా కనిపిస్తోంది. మందాయిపల్లి పరిధిలోని సర్వే నంబర్లు 37(P), 39, 40, 42, 44 నుంచి 48 వరకు, పోతాయిపల్లి పరిధిలోని 44(P), 45(P), 48(P), 49(P), 50 నుంచి 58 వరకు, అలాగే దేవరయాంజాల్ పరిధిలోని 268(P), 273 నుంచి 293 వరకు, 294(P), 296, 303 నుంచి 311 వరకు, 320 నుంచి 332 వరకు, 360 నుంచి 375 వరకు ఉన్న భూముల్లో ఈ అక్రమాలు జరిగినట్లు గుర్తించారు. మరీ ముఖ్యంగా దేవరయాంజాల్ రెవెన్యూ పరిధిలోని సర్వేనంబర్ 360లో కేవలం 14 గుంటల భూమికి మాత్రమే నాలా (వ్యవసాయేతర) కన్వర్షన్ అనుమతులు పొంది, ఏకంగా 2 ఎకరాల 19 గుంటల భూమిని చదును చేసి ప్లాట్లుగా విక్రయిస్తున్నారన్నది బాధిత రైతుల ప్రధాన ఆరోపణ. తమ భూములను ఆక్రమించారని ప్రశ్నిస్తే స్థానిక రైతులపైనే బెదిరింపులకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
ఇరిగేషన్ 'ఎన్‌ఓసీ' రద్దు.. రిజిస్ట్రేషన్ల పై బ్రేక్..
క్షేత్రస్థాయిలో వెలుగులోకి వచ్చిన ఈ భారీ ఉల్లంఘనలపై నీటిపారుదల శాఖ (ఇరిగేషన్) కఠిన చర్యలకు ఉపక్రమించింది. చీఫ్ ఇంజనీర్ ఆదేశాల మేరకు జారీ చేసిన తాజా మెమో ద్వారా ఈ వెంచర్‌కు 2023 మే 4న మంజూరు చేసిన ఎన్‌ఓసీ (క్లియరెన్స్) ను తక్షణమే రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. రద్దు చేసిన అనుమతుల నేపథ్యంలో తక్షణమే అన్ని రకాల అభివృద్ధి పనులను నిలిపివేయాలని డెవలపర్లను ఆదేశించింది. దీనికి కొనసాగింపుగా ప్రభుత్వ యంత్రాంగం శామీర్‌పేట సబ్-రిజిస్ట్రార్ కార్యాలయానికి కీలక ఆదేశాలు జారీ చేసింది. తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు సుచిర్ ఇండియా, వాసవి నిర్మాణ్‌కు చెందిన ఈ వివాదాస్పద వెంచర్‌లోని ప్లాట్లను ఎట్టి పరిస్థితుల్లోనూ రిజిస్ట్రేషన్ చేయవద్దని స్పష్టం చేసింది.
హెచ్‌ఎండీఏ షోకాజ్.. మున్సిపల్ అనుమతుల పై ఆంక్షలు..
బఫర్ జోన్లు, నాలాల ఆక్రమణలకు సంబంధించిన నివేదికల ఆధారంగా హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ (హెచ్‌ఎండీఏ) కూడా రంగంలోకి దిగింది. లేఅవుట్ డెవలపర్లకు షోకాజ్ నోటీసు జారీ చేసింది. ఆక్రమణల నేపథ్యంలో లే అవుట్ అనుమతులను ఎందుకు రద్దు చేయకూడదో 15 రోజుల్లోగా సవివరమైన వివరణ ఇవ్వాలని ఆదేశించింది. మరోవైపు, ఎంఎంసీ కీసర సర్కిల్ డిప్యూటీ కమిషనర్‌కు కూడా లేఖ రాసింది. ఆక్రమణకు గురైన నాలాలను తిరిగి యథాస్థితికి తీసుకువచ్చే వరకు సదరు వెంచర్‌లో ఎలాంటి ఇళ్ల నిర్మాణాలకు (బిల్డింగ్ పర్మిషన్లు) అనుమతులు మంజూరు చేయవద్దని స్పష్టంగా పేర్కొంది. అధికారుల తాజా చర్యలతో ఈ వివాదాస్పద వెంచర్‌లో ప్లాట్లు కొనుగోలు చేసిన సామాన్యులు, పెట్టుబడిదారులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ప్రభుత్వమే తమకు న్యాయం చేయాలని వారు వేడుకుంటున్నారు.






