తెలంగాణ ప్రజలకు వాస్తవాలు తెలియజేస్తాం: మాజీ ఎంపీ

by Gantepaka Srikanth |

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ భారతదేశ ఆర్థిక లక్ష్యాలకు బలమైన పునాదిగా నిలుస్తుందని మాజీ రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు పేర్కొన్నారు.

తెలంగాణ ప్రజలకు వాస్తవాలు తెలియజేస్తాం: మాజీ ఎంపీ
X

దిశ, తెలంగాణ బ్యూరో: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ భారతదేశ ఆర్థిక లక్ష్యాలకు బలమైన పునాదిగా నిలుస్తుందని మాజీ రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు పేర్కొన్నారు. గత 11 సంవత్సరాలుగా భారత ఆర్థిక వ్యవస్థను పటిష్టంగా తీర్చిదిద్దిన మోడీ ప్రభుత్వం, కాంగ్రెస్ పాలనలో 11వ స్థానంలో ఉన్న భారతదేశాన్ని కేవలం ఒక దశాబ్దంలోనే ప్రపంచంలో నాలుగో అతిపెద్ద ఆర్థిక శక్తిగా మార్చిందని గుర్తుచేశారు. సోమవారం పార్టీ రాష్ర్ట కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఈ బడ్జెట్ ఆత్మనిర్భర భారత నిర్మాణానికి కీలకమైనదని, ఇప్పటికీ విదేశాలపై ఆధారపడుతున్న కెమికల్స్, ఎలక్ట్రానిక్స్, ఫార్మా వంటి రంగాల్లో దేశీయ ఉత్పత్తిని పెంచే దిశగా స్పష్టమైన విధాన రూపకల్పన జరిగిందన్నారు. యువత, మహిళలు, రైతులు, పేదలు అన్నివర్గాలకు మేలు చేసే బడ్జెట్ అని తెలిపారు. దక్షిణాది రాష్ట్రాల ఆర్థిక వృద్ధికి ఈ బడ్జెట్ అపార అవకాశాలను కల్పించిందని, ప్రత్యేకంగా రైల్వే రంగంలో ప్రకటించిన 7 హైస్పీడ్ రైల్ కారిడార్లలో మూడు హైదరాబాద్ కేంద్రంగా ఉండటం కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణపై ఉన్న నిబద్ధతకు నిదర్శనమన్నారు. అయినా తెలంగాణ ప్రభుత్వం దీనికి ఇప్పటివరకు కృతజ్ఞతలు చెప్పకపోవడం దౌర్భాగ్య రాజకీయాల ప్రతిబింబమని విమర్శించారు.

అవినీతికి పరాకాష్ట ధరణి పోర్టల్

యూపీఏ ప్రభుత్వంతో పోలిస్తే గత 10 సంవత్సరాల్లో మోడీ ప్రభుత్వం రాష్ట్రాలకు మూడింతలు నిధులు కేటాయించిందని, దక్షిణాది రాష్ట్రాలకు అయితే ఐదింతలు గ్రాంట్లు ఇచ్చిందని తెలిపారు. కేంద్రం ఏమి ఇవ్వలేదంటూ కాంగ్రెస్ తప్పుడు ప్రచారం చేయడం ‘స్పిట్ అండ్ రన్ పాలిటిక్స్’కు నిదర్శనమన్నారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని సర్​ప్లస్ రాష్ట్రం నుంచి అప్పుల రాష్ట్రంగా మార్చాయని, అభివృద్ధి శూన్యమని, అవినీతి అనంతంగా మారిందని విమర్శించారు. కాంగ్రెస్ పాలన అంటే - నో గవర్నెన్స్, ఓన్లీ కరప్షన్ అని, పరిపాలన కనిపించదని, అవినీతి మాత్రమే దర్శనమిస్తోందన్నారు. ధరణి పోయి భూభారతి వచ్చిన అవినీతి మాత్రం మారలేదు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపుతామని తీసుకొచ్చిన ధరణి పోర్టల్ అవినీతికి పరాకాష్టగా మారిందని గుర్తుచేశారు.

రాజకీయ నాటకాలకే పరిమితం

అయితే కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ధరణిని బంగాళాఖాతంలో కలిపేస్తామని, అధికారంలోకి వచ్చాక భూభారతి పోర్టల్ తీసుకొస్తామని రేవంత్ రెడ్డి చెప్పారని, ఇప్పుడు అదే భూభారతి రైతులకు కొత్త సమస్యలు, అవినీతికి కేంద్రబిందువుగా మారిందని మండిపడ్డారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేనంత దారుణంగా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వంలో అవినీతి జరుగుతోందని ఘాటుగా విమర్శించారు. ఒకప్పుడు 40 శాతం కమీషన్ల ప్రభుత్వంగా ఉన్న పాలన, ఇప్పుడు 60 శాతం కమీషన్ల ప్రభుత్వంగా మారిందని ఆరోపించారు. దేశవ్యాప్తంగా జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ విజయాలు సాధిస్తోందని, డబుల్ ఇంజన్ సర్కార్ ఇప్పుడు అనేక చోట్ల ట్రిపుల్ ఇంజన్ సర్కార్‌గా మారిందని అన్నారు. తెలంగాణలో కూడా ప్రజలకు వాస్తవాలు తెలియజేస్తూ కాంగ్రెస్ అవినీతి పాలనకు గుణపాఠం చెప్పే దిశగా బీజేపీ ముందుకెళ్తుందని చెప్పారు. దేశవ్యాప్తంగా మోడీ ప్రభుత్వం సుపరిపాలన, పారదర్శకత, అభివృద్ధిని ముందుకు తీసుకెళ్తుంటే, తెలంగాణలో మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతి, రాజకీయ నాటకాలకే పరిమితమైందని విమర్శించారు. అభివృద్ధిపై నిజమైన ఆసక్తి ఉంటే, కేంద్రం కల్పిస్తున్న అవకాశాలను వినియోగించుకోవాలని, ప్రజల సొమ్మును ప్రజల కోసం ఖర్చు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

Next Story