అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను అడ్డుకున్న మాజీ ఎమ్మెల్యే

by Batti.Sumithra |

మాగనూర్ మండలంలోని పెద్దవాగు నుంచి అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న ఓ కంపెనీకి చెందిన టిప్పర్లు, జేసీబీలను మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి అడ్డుకున్నారు.

అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను అడ్డుకున్న మాజీ ఎమ్మెల్యే
X

దిశ, మక్తల్ : మాగనూర్ మండలంలోని పెద్దవాగు నుంచి అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న ఓ కంపెనీకి చెందిన టిప్పర్లు, జేసీబీలను మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి అడ్డుకున్నారు. ఆదివారం మాగనూర్ మండలంలో ఓ శుభకార్యానికి వెళ్లి తిరిగి వస్తుండగా, పట్టపగలు జేసీబీలతో ఇసుకను తవ్వి టిప్పర్లలో తరలిస్తున్న దృశ్యాన్ని గమనించిన ఆయన వెంటనే అక్కడికి వెళ్లి వాహనాలను నిలిపివేశారు. ఈ సందర్భంగా టిప్పర్లు, జేసీబీ డ్రైవర్లను ప్రశ్నిస్తూ, "ఆదివారం సెలవు రోజు ఇసుక తవ్వకాలకు ఎలాంటి అనుమతి ఉండదు. అలాంటప్పుడు మీరు ఎలా ఇసుకను తరలిస్తున్నారు ?" అని నిలదీశారు. జాతీయ రహదారి వంతెనకు సమీపంలో ఇసుక తవ్వడం వల్ల వంతెన భద్రతకు ముప్పు వాటిల్లే అవకాశం ఉందని, దీని పై సంబంధిత అధికారులకు అవగాహన లేదా అని ఆయన ప్రశ్నించారు.

ప్రతి కార్మికుడికి ఆదివారం సెలవు దినమని, ఆ రోజు ఇసుక తవ్వకం లేదా రవాణాకు ఏ ప్రభుత్వ అధికారి కూడా అనుమతి ఇవ్వలేరని చిట్టెం రామ్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో అక్రమంగా ఇసుకను తరలిస్తున్న టిప్పర్లను నిలిపివేసి, తవ్వకాలు జరుగుతున్న ప్రాంతానికి తిరిగి పంపించారు. ఇదిలా ఉండగా, మక్తల్, నారాయణపేట, కొడంగల్ ఎత్తిపోతల పథకాల పనుల కోసం ఇసుకను తరలిస్తున్నామని సంబంధిత కంపెనీ ప్రతినిధులు చెప్పినప్పటికీ, ఆదివారం సెలవు రోజున కూడా జేసీబీలతో ఇసుకను తవ్వి వాగు ఎగువ భాగంలో డంప్ చేస్తూ, వాగు ఒడ్డున ఇసుక కుప్పలు వేస్తున్న వాహనాలను మాజీ ఎమ్మెల్యే అడ్డుకున్నారు. ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టే విధంగా అక్రమ ఇసుక రవాణాకు పాల్పడుతున్న ఇసుక మాఫియాపై అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఇప్పటికైనా రెవెన్యూ, పోలీసు, మైనింగ్ శాఖల అధికారులు అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుకను తరలిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోకపోతే, తమ పార్టీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముట్టడి, జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహిస్తామని చిట్టెం రామ్మోహన్ రెడ్డి హెచ్చరించారు.

Next Story