60 ఏళ్ల వయసులో లా సెట్‌లో మెరిసిన మాజీ మావోయిస్టు అగ్రనేత

by Jakkula.Mamatha |

సంకల్పం ఉంటే వయసు అడ్డంకి కాదని, చదువుకు వయసుతో సంబంధం లేదని మాజీ మావోయిస్టు కీలక నేత తిపిరి తిరుపతి అలియాస్ దేవ్ జీ మరోసారి నిరూపించారు.

60 ఏళ్ల వయసులో లా సెట్‌లో మెరిసిన మాజీ మావోయిస్టు అగ్రనేత
X

దిశ, జగిత్యాల ప్రతినిధి: సంకల్పం ఉంటే వయసు అడ్డంకి కాదని, చదువుకు వయసుతో సంబంధం లేదని మాజీ మావోయిస్టు కీలక నేత తిపిరి తిరుపతి అలియాస్ దేవ్ జీ మరోసారి నిరూపించారు. రాష్ట్రవ్యాప్తంగా గురువారం విడుదలైన లా సెట్ ఫలితాల్లో ఐదేళ్ల న్యాయ విద్య కోర్సు ప్రవేశ పరీక్షలో 349వ ర్యాంకు సాధించి అందరి ప్రశంసలు అందుకుంటున్నారు. ఇటీవల జనజీవన స్రవంతిలో కలిసిన దేవ్ జీ, సమాజ సేవకు కొత్త దారిని ఎంచుకున్నారు. న్యాయ విద్యను అభ్యసించి పేదలకు ఉచిత న్యాయ సహాయం అందించాలనే లక్ష్యంతో ఆయన చదువు బాట పట్టారు. ఆ సంకల్పానికి నిదర్శనంగా లా సెట్‌లో ఉత్తమ ప్రతిభ కనబరిచి ర్యాంకు సాధించారు. దాదాపు 40 ఏళ్ల క్రితం ఇంటర్మీడియట్‌లో మిగిలిపోయిన తెలుగు సబ్జెక్టును బోర్డు ప్రత్యేక అనుమతితో ఇటీవల పూర్తి చేశారు.

అనంతరం న్యాయ విద్యలో ప్రవేశం కోసం నిర్వహించిన లా సెట్ పరీక్షకు హాజరై విజయాన్ని అందుకున్నారు. 60 ఏళ్లు దాటిన వయసులోనూ విద్య పట్ల ఆయన చూపిన ఆసక్తి, పట్టుదల నేటి తరానికి స్ఫూర్తిగా నిలుస్తోంది. ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ లా కోర్సు ద్వారా న్యాయ విద్యతో పాటు మరో డిగ్రీ కూడా పూర్తయ్యే అవకాశం ఉండటంతో ఈ కోర్సును ఎంచుకున్నట్లు తెలిసింది. నాలుగు దశాబ్దాల పాటు ప్రజా సమస్యల కోసం ఉద్యమ బాటలో నడిచిన దేవ్ జీ , ఇప్పుడు న్యాయశాస్త్రం ద్వారా ప్రజలకు సేవ చేయాలని సంకల్పించడం విశేషం. ముఖ్యంగా చెడు వ్యసనాలకు బానిసై చదువును నిర్లక్ష్యం చేస్తున్న యువతకు ఆయన జీవితం ఒక సందేశంగా నిలుస్తోంది. లా సెట్‌లో 349వ ర్యాంకు సాధించిన దేవ్ జీకి కుటుంబసభ్యులు, బంధుమిత్రులు, శ్రేయోభిలాషులు అభినందనలు తెలియజేస్తున్నారు.

Next Story