మహాత్మాగాంధీతో పరిచయమున్న మాజీ ఐపీఎస్ కన్నుమూత

by Disha Web Desk 2 |
మహాత్మాగాంధీతో పరిచయమున్న మాజీ ఐపీఎస్ కన్నుమూత
X

దిశ, తెలంగాణ బ్యూరో: హైదరాబాద్ పోలీసు సర్వీసు చివరి బ్యాచ్ అధికారి రాఘవరెడ్డి (94) అనారోగ్యంతో నగరంలోని ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం సాయంత్రం కనుమూశారు. ఆయన అంత్యక్రియలు జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానంలో మంగళవారం మధ్యాహ్నం జరగనున్నాయి. ఆయన మృతి పట్ల పోలీసు అధికారులు, అదనపు ఎస్పీ తిరుపతి రెడ్డి సహ పలువురు సంతాపం వ్యక్తం చేశారు. వరంగల్ జిల్లా పెంబర్తి గ్రామంలో దేశ్‌ముఖ్ కుటుంబంలో జన్మించిన రాఘవరెడ్డి తన ఆరేళ్ళ వయసులోనే తల్లిదండ్రులిద్దరినీ కోల్పోయారు.

అప్పట్లో కాంగ్రెస్ పార్టీలో ఉన్న రావి నారాయణరెడ్డి (తర్వాత కమ్యూనిస్టు పార్టీలో చేరారు) ఆరేళ్ళ రాఘవరెడ్డి ఆలనాపాలనా చూసుకున్నారు. మహాత్మాగాంధీ హైదరాబాద్ టూర్ సందర్భంగా 1934 మార్చి 9వ తేదీన రాఘవరెడ్డిని పరిచయం చేశారు. అంటరానితనం ఉధృతంగా ఉన్న సమయంలో గాంధీజీ సూచన మేరకు రాఘవరెడ్డిని ఎస్సీ సంక్షేమ హాస్టల్‌లో చేర్పించిన రావి నారాయణరెడ్డి ప్రాథమిక విద్యాభ్యాసాన్ని అక్కడే పూర్తిచేశారు. ఆ తర్వాత నగరంలోని రెడ్డి హాస్టల్‌లో చేరి అప్పటి పోలీసు కమిషనర్ రావ్ బహద్దూర్ వెంకటరామిరెడ్డి పర్యవేక్షణలో హైస్కూలు విద్యను పూర్తిచేశారు.

స్వస్థలానికి వెళ్ళిన రాఘవరెడ్డి అప్పటి నిజాం రజాకార్ల అణచివేత, తెలంగాణ సాయుధ పోరాటం, జాతీయ ఉద్యమం లాంటి సన్నివేశాలను కళ్ళారా చూసి హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణమయ్యారు. స్వాతంత్ర్య పోరాటయోధులు రామానంద తీర్థతో సాన్నిహిత్యం ఏర్పడిన రాఘవరెడ్డి ఉస్మానియా విశ్వవిద్యాలయంలో డిగ్రీ పూర్తిచేశారు. ఈవెనింగ్ లా కళాశాలలో న్యాయవాద విద్యను పూర్తిచేశారు. 1956లో హైదరాబాద్ పోలీసు సర్వీస్ చివరి బ్యాచ్‌కు ఎంపికై శిక్షణను పూర్తిచేసుకుని 1957 జనవరిలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నేరుగా డీఎస్పీగా బాధ్యతలు స్వీకరించారు. దాదాపు 32 సంవత్సరాల పాటు పోలీసు అధికారిగా సేవలందించారు. ప్రజలకు సేవలందించడంలో ఎంతో మంది పోలీసులకు ఆయన ఆదర్శంగా నిలిచారని అదనపు ఎస్పీ తిరుపతిరెడ్డి వివరించారు.

సుదీర్ఘకాలం పోలీసు అధికారిగా ఉద్యోగం చేసిన రాఘవరెడ్డి 'యాజ్ ఐ లుక్ బ్యాక్' అనే పుస్తకంలో తన అనుభవాలను ఉదహరించారు. పదవీ విరమణ చేసిన తర్వాత ఇరవై ఏళ్ళ తర్వాత ఈ పుస్తకాన్ని రాశారని, అప్పటికీ ఆయనకు రెండుసార్లు బైపాస్ సర్జరీ జరిగిందని, ఉదరకోశ క్యాన్సర్‌తో బాధపడుతున్నారని, ఒక కంటి చూపు పూర్తిగా పోయిందని తిరుపతిరెడ్డి గుర్తుచేశారు. వృత్తిధర్మంలో ఆదర్శవంతమైన పాత్రను పోషించి పోలీసులకు రోల్ మోడల్‌గా నిలిచారని, నిబద్ధతతో 'రూల్ ఆఫ్ లా'కు కట్టుబడ్డారని గుర్తుచేశారు.


Next Story

Most Viewed