లిక్కర్ స్కాంలో నిర్దోషిగా తేలిన కేజ్రీవాల్.. మీడియా ముందు కన్నీటి పర్యంతమైన ఢిల్లీ మాజీ సీఎం

by Malleboina Mahesh |

మద్యం పాలసీ కేసులో కేజ్రీవాల్‌కు క్లీన్ చీట్: 900 రోజుల నిరీక్షణకు తెర.. కోర్టు తీర్పుతో భావోద్వేగానికి లోనై కన్నీరు పెట్టుకున్న ఆప్ అధినేత

లిక్కర్ స్కాంలో నిర్దోషిగా తేలిన కేజ్రీవాల్.. మీడియా ముందు కన్నీటి పర్యంతమైన ఢిల్లీ మాజీ సీఎం
X

దిశ, వెబ్ డెస్క్: దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు (Delhi liquor scam case)లో 23 మందికి రౌస్ అవెన్యూ కోర్టు క్లీన్ చిట్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal), మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా సహా మొత్తం 23 మందిని ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు (Rouse Avenue Court) నేడు నిర్దోషులుగా ప్రకటిస్తూ సంచలన తీర్పునిచ్చింది. ఈ కేసులో కుట్ర జరిగినట్లు చూపేందుకు సీబీఐ వద్ద ఎటువంటి బలమైన ఆధారాలు లేవని, చార్జిషీట్‌లో పేర్కొన్న అంశాలు పరస్పర విరుద్ధంగా ఉన్నాయని ప్రత్యేక న్యాయమూర్తి జితేంద్ర సింగ్ స్పష్టం చేశారు. కేజ్రీవాల్‌ను ఎటువంటి ప్రాథమిక ఆధారాలు లేకుండానే ఈ కేసులో ఇరికించారని కోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేయడమే కాకుండా, దర్యాప్తులో జరిగిన లోపాలపై సంబంధిత అధికారులపై విచారణకు కూడా ఆదేశించింది.

మీడియా ముందుకు కేజ్రీవాల్ కన్నీరు

రౌస్ అవెన్యూ కోర్టు తీర్పు వెలువడిన అనంతరం మీడియా ముందుకు వచ్చిన అరవింద్ కేజ్రీవాల్ తీవ్ర భావోద్వేగానికి లోనై కన్నీరు పెట్టుకున్నారు. తన రాజకీయ జీవితంలో ఎప్పుడూ నిజాయితీనే సంపాదించుకున్నానని, తనను, తన పార్టీని అప్రతిష్ఠ పాలు చేసేందుకు పన్నిన అతిపెద్ద రాజకీయ కుట్ర ఇదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. "కేజ్రీవాల్ అవినీతిపరుడు కాదు. కట్టర్ ఇమాందార్ (నిఖార్సైన నిజాయితీపరుడు)" అని ఈరోజు న్యాయస్థానం నిరూపించిందని ఆయన ఉద్వేగంతో చెప్పారు. జైల్లో గడిపిన రోజులను గుర్తు చేసుకుంటూ, సత్యమే చివరికి గెలిచిందని మనీష్ సిసోడియాను హత్తుకుని కన్నీళ్లు తుడుచుకున్నాడు.

అనంతరం ప్రెస్ మీట్ పెట్టిన మాట్లాడిన కేజ్రీవాల్ కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకు పడ్డారు. తనను రాజకీయంగా దెబ్బతీయడానికి సీబీఐని ఉపయోగించారని, దేశానికి మోడీ, అమిత్ షా క్షమాపణలు చెప్పాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. అలాగే తాను రాజకీయాల్లోకి వచ్చి డబ్బు సంపాదించలేదని, నీతి నిజాయితీనే సంపాదించుకున్నానని, తనపై తప్పుడు కేసులు పెట్టి జైలుకు పంపిన వారికి ప్రజలు తగిన బుద్ధి చెబుతారని ఢిల్లీ మాజీ సీఎం, ఆఫ్ నేషనల్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ చెప్పుకొచ్చారు.

Next Story