- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆయుధాలతో అటవీ ప్రాంతంలోకి ఎంట్రీ.. వేటగాళ్లకు సినిమా చూపించిన ఫారెస్ట్ అధికారులు!
వన్యప్రాణులను వేటాడేందుకు అటవీ ప్రాంతంలోకి ప్రవేశించిన నలుగురు వేటగాళ్లను అటవీశాఖ అధికారులు చాకచక్యంగా పట్టుకున్నారు.

దిశ, దమ్మపేట: వన్యప్రాణులను వేటాడేందుకు అటవీ ప్రాంతంలోకి ప్రవేశించిన నలుగురు వేటగాళ్లను అటవీశాఖ అధికారులు చాకచక్యంగా పట్టుకున్నారు. వారి వద్ద నుంచి ఆయుధాలను స్వాధీనం చేసుకుని జైలుకు పంపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం గండుగులపల్లి అటవీ బీట్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. అటవీశాఖ రేంజ్ అధికారి శ్రీనివాసరావు తెలిపిన వివరాల ప్రకారం.. మంగళవారం తెల్లవారుజామున గండుగులపల్లి అటవీ ప్రాంతంలో కొందరు వ్యక్తులు ద్విచక్ర వాహనాలపై అనుమానాస్పదంగా సంచరిస్తున్నట్లు అటవీశాఖ అధికారులకు పక్కా సమాచారం అందింది. దీంతో వెంటనే అప్రమత్తమైన సిబ్బంది అక్కడికి చేరుకుని నిందితులను వెంబడించారు.
అధికారులను గమనించిన ఇద్దరు వ్యక్తులు ద్విచక్ర వాహనంపై పరారీ కాగా, మరో ఇద్దరు సిబ్బందికి పట్టుబడ్డారు. వారిని తనిఖీ చేయగా ఒక నాటు తుపాకీ, ఐదు తూటాలు, రెండు సెల్‌ఫోన్లతో పాటు ఒక ద్విచక్ర వాహనం లభ్యమయ్యాయి. వాటిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం గాలింపు చర్యలు ముమ్మరం చేసి, బుధవారం ఉదయం పరారీలో ఉన్న మిగిలిన ఇద్దరు నిందితులను కూడా అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడిన నలుగురు నిందితులపై వన్యప్రాణి సంరక్షణ చట్టంతో పాటు, అక్రమ ఆయుధాలు కలిగి ఉన్నారనే అభియోగాలపై కేసులు నమోదు చేసినట్లు రేంజ్ అధికారి శ్రీనివాసరావు వెల్లడించారు.వేటగాళ్లను పట్టుకునే ఆపరేషన్‌లో కీలకంగా వ్యవహరించిన గండుగులపల్లి బీట్ అధికారిణి ఎస్.భవాని, డిప్యూటీ రేంజ్ అధికారి జె.జయరాం, బేస్ క్యాంప్ సిబ్బంది నాగరాజు, లక్ష్మణ్‌లను ఉన్నతాధికారులు ప్రత్యేకంగా అభినందించారు. పట్టుబడిన నలుగురు నిందితులను దమ్మపేట కోర్టులో హాజరుపరచగా, న్యాయమూర్తి భవాని వారికి 14 రోజుల రిమాండ్ విధించారు. కోర్టు ఆదేశాల మేరకు నిందితులను సత్తుపల్లి సబ్ జైలుకు తరలించినట్లు అధికారులు తెలిపారు.






