రాజేంద్రనగర్‌లో ఫుట్‌పాత్ ఆక్రమణల జోరు.. అధికారుల నిర్లక్ష్యం.. ట్రాఫిక్ నరకం

by Malleboina Mahesh |

రాజేంద్రనగర్‌లో ఫుట్‌పాత్ ఆక్రమణల సెగ! రోడ్లపైనే వ్యాపారాలు.. పట్టించుకోని అధికారులు. నార్సింగిలో చర్యలు.. ఇక్కడ మాత్రం శూన్యం?

రాజేంద్రనగర్‌లో ఫుట్‌పాత్ ఆక్రమణల జోరు.. అధికారుల నిర్లక్ష్యం.. ట్రాఫిక్ నరకం
X

దిశ, గండిపేట: రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలో ఫుట్‌పాత్ ఆక్రమణలు రోజురోజుకీ పెరుగుతూ వాహనదారులు, పాదచారులకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తున్నాయి. వందల సంఖ్యలో ఆక్రమణలు జరగడంతో రహదారులు కుచించుకుపోయి ట్రాఫిక్ సమస్యలు అధికమవుతున్నాయి. అయినప్పటికీ సంబంధిత అధికారులు మాత్రం పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సర్కిల్ పరిధిలోని అనేక ప్రాంతాల్లో వ్యాపారులు ఫుట్‌పాత్‌లపైనే తమ వ్యాపారాలు కొనసాగిస్తూ రహదారులను ఆక్రమిస్తున్నారు.

ఆర్మీ స్కూల్ నుంచి కాళీ మందిర్ అమ్మవారి ఆలయం వరకు ప్రధాన రహదారికి ఇరువైపులా పెద్ద ఎత్తున ఆక్రమణలు కనిపిస్తున్నాయి. సన్ సిటీ ప్రాంతంలో ఫుట్‌పాత్‌లపైనే సైకిళ్లు నిలిపి వ్యాపారం చేయడం, మెడికల్ షాపులు రోడ్డుపైనే వస్తువులు ఉంచడం, కొబ్బరి బోండాలు, టీ స్టాళ్లు, పంచర్ షాపులు, పానీ పూరి బండ్లు వంటి అనేక దుకాణాలు రహదారిని ఆక్రమిస్తున్నాయి. అదేవిధంగా హైదర్ షాకోట్, గంధంగూడలో ఇదే పరిస్థితి నెలకొంది.

కిస్మత్ పూర్ వైపు వెళ్లే దారిలో..

ఇక బండ్లగూడ జాగిర్ సర్కిల్ నుంచి కిస్మత్పూర్ వరకు కూడా ఇదే పరిస్థితి నెలకొంది. రహదారి ఇరుకుగా మారడంతో వాహనదారులు ప్రతిరోజూ ఇబ్బందులు పడుతున్నారు. రాత్రి సమయాల్లో ట్రాఫిక్ పూర్తిగా స్తంభించిపోతున్నది. కాళీ మందిర్ నుంచి హిమాయత్ సాగర్ వెళ్లే మార్గంలో కూడా రోడ్డుపక్కనే చిన్న చిన్న దుకాణాలు వెలిసి పరిస్థితి మరింత అధ్వానంగా మారింది. అమ్మవారి ఆలయం నుంచి పోలీస్ అకాడమీ వరకు రహదారుల పరిస్థితి దయనీయంగా ఉంది.

ప్రశ్నార్థకంగా అధికారుల పాత్ర..

ఫుట్‌పాత్ ఆక్రమణలపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన రాజేంద్రనగర్ సర్కిల్ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. డిప్యూటీ కమిషనర్ సురేందర్ రెడ్డి ప్రతిరోజు శానిటేషన్ పర్యవేక్షణ చేస్తున్నప్పటికీ ఈ సమస్యపై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. పొరుగున ఉన్న నార్సింగి సర్కిల్‌లో ఇటీవల ఆక్రమణలపై కఠిన చర్యలు తీసుకున్నప్పటికీ, రాజేంద్రనగర్‌లో మాత్రం పరిస్థితి యథాతథంగా కొనసాగుతుండటం ప్రజల్లో ఆగ్రహాన్ని రేకెత్తిస్తోంది.

తక్షణ చర్యలు తీసుకోవాలి..

ఇప్పటికైనా సర్కిల్ అధికారులు నిర్లక్ష్యపు నిద్రవీడి ఫుట్‌పాత్ ఆక్రమణలపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయంలో డిప్యూటీ కమిషనర్ సురేందర్ రెడ్డి స్పందించి సత్వర చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఫుట్పాత్ ఆక్రమణలపై ఉక్కుపాదం మోపాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

Next Story