- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హోటళ్లలో ఇష్టారాజ్యంగా బిర్యానీల తయారీ.. పట్టించుకోని ఫుడ్ సేఫ్టీ అధికారులు!
ఖమ్మం నగరంలో ఇష్టారాజ్యంగా వెలుస్తున్న హోటళ్లు, రెస్టారెంట్లలో కల్తీ బిర్యానీలతో ప్రజల ప్రాణాలు పోతున్న పట్టించుకునే పరిస్థితి లేదు.

దిశ, ఖమ్మం టౌన్: ఖమ్మం నగరంలో ఇష్టారాజ్యంగా వెలుస్తున్న హోటళ్లు, రెస్టారెంట్లలో కల్తీ బిర్యానీలతో ప్రజల ప్రాణాలు పోతున్న పట్టించుకునే పరిస్థితి లేదు. నగరంలో నిత్యం ఏదో ఒక రెస్టారెంట్లలో బల్లులు పడడం, బొద్దింకలు, తల వెంట్రుకలు ఇలా ఏదో ఒక సమస్యతో బిర్యానీలతో బిర్యానీ ప్రియులు ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. చిన్న చిన్న హోటల్లు, తోపుడు బండ్ల వ్యాపారుల మీద ప్రతాపం చూపించే అధికారులు పెద్ద పెద్ద రెస్టారెంట్ల మీద, దాబాల మీద ఎందుకు నిర్వహించడం లేదని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఎక్కడైనా సమస్య ఏర్పడితే వెంటనే ఆ రెస్టారెంట్లు దాబాల మీద తాత్కాలిక దాడులు నిర్వహించి మామూళ్లు తీసుకోవడం పరిపాటిగా మారిందని పలువురు పేర్కొంటున్నారు. నెలరోజుల పరిధిలో బిర్యాని సెంటర్లలో మూడు ఘటనలు చోటు చేసుకున్నాయి.
మమతా రోడ్డులో ఓ బిర్యాని సెంటర్‌లో కుటుంబ సమేతంగా బిర్యానీ తిన్న ఆరుగురు కుటుంబ సభ్యులకు వాంతులు విరేచనాలు కావడంతో ఓ ప్రైవేటు వైద్యశాలలో చేరి వైద్యం చేయించుకున్నారు. వైరా రోడ్డులో గల హవేలీ రెస్టారెంట్‌లో ఓ బిర్యాని ప్రియుడు ఫ్యామిలీ ప్యాక్ పార్సిల్ తీసుకొని ఇంటికి వెళ్లి తింటుండగా బిర్యానీలో బల్లి శకలం కనబడటంతో ఒక్కసారి ఆందోళనకు గురయ్యారు. ఆ ఘటన మరువకముందే హోటల్ కోణార్క్ లో బిర్యానీలో బొద్దింక రావడం కలకలం రేపింది. ఇలా రోజుకో రెస్టారెంట్ లో బిర్యానీలో ఏదో ఒక అవశేషాలు కనపడడం పరిపాటిగా మారింది. ఈ ఘటనలపై ఫుడ్ సేఫ్టీ అధికారులకు ఫిర్యాదులు అందుతున్నప్పటికీ ఆ రెస్టారెంట్లపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం పై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. తనిఖీలు చేయలేదు అనకుండా నామమాత్రంగా శాంపిల్స్ తీసి రెస్టారెంట్‌ల యాజమాన్యాలతో మాట్లాడుకొని చేతులు దులుపుకుంటున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.
లైసెన్స్ లేకుండానే నడుపుతున్న హోటల్లో రెస్టారెంట్లు..
నిత్యం నగరంలో పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న హోటల్లు రెస్టారెంట్లకు ఫుడ్ సేఫ్టీ అధికారుల నుంచి లైసెన్స్‌లు లేకుండా ఇష్టారాజ్యంగా నడుపుతూ.. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతూ లక్షల రూపాయల సొమ్ము చేసుకుంటు ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారు. వ్యాపారులపై ఫుడ్ సేఫ్టీ అధికారులు నామ మాత్రపు తనిఖీలు చేస్తూ వారి జేబులు నింపుకుంటున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. వందల కొద్దీ హోటళ్ళు రోజుకో బిర్యానీ సెంటర్ లు వెలుస్తున్న కనీసం వాటి పై కన్నెత్తి చూడకపోవడం పై పలు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
ఇష్టారాజ్యంగా వంటల తయారీ..
హోటల్లో రెస్టారెంట్‌లలో రెండో రకం కూరగాయలు, ఫ్రిడ్జ్‌లలో నిల్వ చేసిన మటన్, చికెన్‌లతో బిర్యానీలు తయారుచేసి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు.
ఇష్టారాజ్యంగా బిర్యానీలు తయారు చేస్తే చర్యలు తప్పవు: జిల్లా ఫుడ్ ఇన్‌స్పెక్టర్ లోకేష్
అనుమతులు లేకుండా రెస్టారెంట్లు, దాబాలో బిర్యానీ సెంటర్లు నిర్వహిస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడితే సహించేది లేదని జిల్లా ఫుడ్ ఇన్‌స్పెక్టర్ లోకేష్ హెచ్చరించారు. రెస్టారెంట్లు, హోటల్ నిర్వాహకులు తప్పనిసరిగా లైసెన్సులు పొందాలని లేనియెడల అలాంటి వారిపై కేసులు నమోదు చేస్తామని అన్నారు.






