Gold Imports: సుంకం షాక్‌తో బంగారం దిగుమతులకు బ్రేక్

by S Gopi |

గతంలో ప్రతి నెలా సగటున 75 నుంచి 100 టన్నులు వచ్చే దిగుమతులు, ఇప్పుడు కేవలం 25-30 టన్నులకు పరిమితమయ్యాయని అధికారిక వర్గాలు గురువారం వెల్లడించాయి.

Gold Imports: సుంకం షాక్‌తో బంగారం దిగుమతులకు బ్రేక్
X

దిశ, బిజినెస్ బ్యూరో: దేశంలో బంగారం దిగుమతులను కట్టడి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న కఠిన నిర్ణయం మెరుగైన ఫలితాలనిస్తోంది. మే 13 నుంచి అమల్లోకి వచ్చేలా బంగారం, వెండిపై దిగుమతి సుంకాన్ని (కస్టమ్స్ డ్యూటీ) 6 శాతం నుంచి ఏకంగా 15 శాతానికి అంటే రెట్టింపు కంటే ఎక్కువగా పెంచిన తర్వాత, గత నెల రోజుల్లో దేశంలోకి వచ్చే బంగారం పరిమాణం ఏకంగా 70 శాతం పడిపోయింది. గతంలో ప్రతి నెలా సగటున 75 నుంచి 100 టన్నులు వచ్చే దిగుమతులు, ఇప్పుడు కేవలం 25-30 టన్నులకు పరిమితమయ్యాయని అధికారిక వర్గాలు గురువారం వెల్లడించాయి. అనవసరమైన విదేశీ మారకద్రవ్య వ్యయాన్ని (డాలర్ల ఖర్చును) తగ్గించి, దేశ ఆర్థిక భద్రతను కాపాడటానికి బంగారం కొనుగోళ్లను నియంత్రించాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పిలుపునిచ్చిన నేపథ్యంలో ఈ సుంకం పెంపు నిర్ణయం జరిగింది.

అయితే పరిమాణం (టన్నులు) పరంగా దిగుమతులు తగ్గినప్పటికీ, మనం చెల్లించే విలువ (డాలర్ల) పరంగా భారం పెరిగింది. మే నెలలో దేశ బంగారం దిగుమతుల విలువ ఏడాది ప్రాతిపదికన 34 శాతం పెరిగి 3.41 బిలియన్ డాలర్ల(రూ. 32.14 వేల కోట్ల)కు చేరింది. ఇక ఈ ఆర్థిక సంవత్సరం(2026-27) ఏప్రిల్-మే రెండు నెలల కాలంలోనైతే ఏకంగా 60.14 శాతం పెరిగి 9.04 బిలియన్ డాలర్ల(రూ. 85.20 వేల కోట్ల)కు చేరింది. మొత్తం భారత దిగుమతుల్లో కేవలం బంగారం వాటాయే 5 శాతానికి పైగా ఉండటం గమనార్హం. ప్రస్తుతం పశ్చిమాసియాలో (మిడిల్ ఈస్ట్) నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల వల్ల ముడి చమురు (క్రూడాయిల్), ఎరువులు, పారిశ్రామిక ముడిసరుకులు వంటి అత్యవసర వస్తువుల ధరలు పెరిగే ప్రమాదం ఉంది. అందుకే, దేశ ఆర్థిక ప్రగతికి, ఆహార భద్రతకు ప్రత్యక్షంగా తోడ్పడే ఇటువంటి అత్యవసర దిగుమతుల కోసమే విదేశీ మారకద్రవ్యాన్ని పొదుపుగా వాడుకోవాలని, బంగారం లాంటి విలాసవంతమైన దిగుమతులకు ప్రాధాన్యత తగ్గించాలని ప్రభుత్వం గట్టి పట్టుదలతో ఉంది.

Next Story