- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
భూకబ్జాలు పెడితే వీపులు సున్నం చేస్తం.. సీఎం రేవంత్ రెడ్డి మాస్ వార్నింగ్
ఎల్బీనగర్‌లోని గుర్రంగూడలో ఎకో పార్క్‌ను ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి, తన రాజకీయ ప్రస్థానాన్ని గుర్తుచేసుకుంటూ భావోద్వేగపూరిత వ్యాఖ్యలు చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: మల్కాజ్‌గిరి ఎంపీగా పోటీ చేసినప్పుడు తనను ఓడించేందుకు కొందరు ప్రయత్నించారని సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. వన మహోత్సవంలో భాగంగా ఇవాళ గుర్రంగూడలోని ఎకో పార్కులో ఆయన నాగలింగం మొక్కను నాటారు. రాష్ట్రంలో రూ.35.50 కోట్ల అభివృద్ధి పనులతో పాటు ఎకో పార్కులో రోబోటిక్ ఏనుగును ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా ప్రజలు తనను ఎంపీగా గెలిపించారని అన్నారు.
అందుకే ఎల్బీనగర్ అంటే ప్రేమ...
మల్కాజ్‌గిరి ఎంపీగా తాను పోటీ చేసినప్పుడు ఎల్బీనగర్ నియోజకవర్గ ప్రజలు తనకు 30 వేల ఓట్ల భారీ మెజార్టీ ఇచ్చి గెలిపించారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గుర్తు చేసుకున్నారు. పార్లమెంట్‌లో తాను చేసిన పోరాటాన్ని గుర్తించిన కాంగ్రెస్ అధిష్టానం పీసీసీ అధ్యక్షుడిగా అవకాశం ఇచ్చిందని, ఆ తర్వాత తాను వెనక్కి తిరిగి చూసుకోలేదని అన్నారు. ప్రజలంతా తనకు కొండంత అండగా నిలవడం వల్లే ఇవాళ ముఖ్యమంత్రిని కాగలిగానని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఎల్బీనగర్ నియోజకవర్గానికి వస్తే తనకు సొంతూరుకు వెళ్లిన అనుభూతి కలుగుతుందని, అందుకే ఈ ప్రాంతంపై తనకు ప్రత్యేక అభిమానమని చాటుకున్నారు.
కుట్రలతోనే 2018లో ఓడా..
2018 అసెంబ్లీ ఎన్నికల్లో కొందరి కుట్రల వల్ల కొడంగల్‌లో ఓడిపోయినప్పుడు, రేవంత్ రెడ్డి రాజకీయ జీవితం ముగిసిపోయిందని చాలా మంది నవ్వుకున్నారని సీఎం వ్యాఖ్యానించారు. ఆ ఓటమి నుంచి ఈ స్థాయికి చేరడానికి కారణమైన ఎల్బీనగర్ ప్రజల కోసమే నేడు ఇక్కడ 424 ఎకరాల భారీ విస్తీర్ణంలో అద్భుతమైన ఎకో పార్క్‌ను ఏర్పాటు చేశామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు. హైడ్రా (HYDRAA) పేదల జోలికి వెళ్లదని, కబ్జాదారుల భరతం పడుతుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. వనస్థలిపురంలో దేవుడి భూములను కబ్జా చేశారని కామెంట్ చేశారు. ప్రభుత్వ భూములను కబ్జా చేసిన వారి వీపులు సున్నం చేస్తామని సీఎం హెచ్చరించారు. భూ కబ్జాల వల్ల ప్రజలకు సమస్యలు రాకూడదనే హైడ్రాను తీసుకొచ్చామని పేర్కొన్నారు.
ఆ పరిస్థితి హైదరాబాద్‌కు రాకూడదు..
ప్రస్తుతం ఢిల్లీ నగరం కాలుష్యంతో అల్లాడుతోందని, ఆ పరిస్థితి హైదరాబాద్‌కు రాకూడదనే ఉద్దేశంతోనే విస్తృతంగా మొక్కల పెంపకం చేపడుతున్నామని అన్నారు. మూసీ పునరుజ్జీవన కార్యక్రమానికి కొందరు అడ్డుపడుతున్నారని, అక్కడ నివసిస్తున్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించి నదిని అభివృద్ధి చేస్తామంటే మోకాలడ్డుతున్నారని ఫైర్ అయ్యారు. దాదాపు 30 వేల ఎకరాల్లో 'భారత్ ఫ్యూచర్ సిటీ' కట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామని, తాము ఫ్యూచర్ సిటీ కడతామంటే ప్రతిపక్షాలు మళ్లీ పాత ఫార్మా కంపెనీలను తెస్తామంటూ అడ్డుపడుతున్నారని రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు.






