బెల్లంపల్లి ఎంజేపీ హాస్టల్‌లో ఫుడ్ పాయిజన్

by Batti.Sumithra |

మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణం శంశీర్‌నగర్ బస్తీలోని పంచముఖ హనుమాన్ ఆలయం పక్కనగల మహాత్మా జ్యోతిబా ఫూలే బాలికల హాస్టల్‌లో ఫుడ్ పాయిజన్‌తో బుధవారం రాత్రి 10 గంటలకు విద్యార్థినులు అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఘటన గురువారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

బెల్లంపల్లి ఎంజేపీ హాస్టల్‌లో ఫుడ్ పాయిజన్
X

దిశ, మంచిర్యాల : మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణం శంశీర్‌నగర్ బస్తీలోని పంచముఖ హనుమాన్ ఆలయం పక్కనగల మహాత్మా జ్యోతిబా ఫూలే బాలికల హాస్టల్‌లో ఫుడ్ పాయిజన్‌తో బుధవారం రాత్రి 10 గంటలకు విద్యార్థినులు అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఘటన గురువారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే బుధవారం మధ్యాహ్నం హాస్టల్‌లో బగారా రైస్, ఆలూ కర్రీతో విద్యార్థినులు భోజనం చేసినట్లు తెలిపారు. సాయంత్రం భోజన సమయంలో సొరకాయ కూరతో భోజనం చేసిన అనంతరం 15 మంది విద్యార్థినులకు కడుపునొప్పి, వాంతులతో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. సిబ్బంది వెంటనే వారిని బెల్లంపల్లి ఏరియా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్య చికిత్స అందించారు.

గురువారం ఉదయం 15 మందిలో ఇద్దరు డిశ్చార్జి అయినట్లు తెలిపారు. డిశ్చార్జి అయిన వారితో పాటు గురువారం ఉదయం మరో 8 మంది విద్యార్థినులు అస్వస్థతతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు తెలిపారు. విద్యార్థినులకు తీవ్ర కడుపునొప్పి, వాంతులు, తలనొప్పి ఉన్నట్లు తెలిపారు. బుధవారం రాత్రి జరిగిన ఫుడ్ పాయిజన్ విషయాన్ని విద్యార్థినుల తల్లిదండ్రులకు తెలియజేయకపోవడం పై ఆసుపత్రి వద్ద తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫుడ్ పాయిజన్ జరిగిన విషయాన్ని తెలుసుకున్న జిల్లా డీఎంహెచ్‌వో నరేందర్ రాథోడ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థినుల పరిస్థితిని పరిశీలించారు.

విద్యార్థినులు బుధవారం హాస్టల్‌లో తీసుకున్న ఆహారం గురించి వారిని అడిగి తెలుసుకున్నారు. విద్యార్థినుల ఆరోగ్య పరిస్థితి పై వైద్యులతో మాట్లాడారు. విద్యార్థినులకు చికిత్స అందించిన వైద్యులతో మాట్లాడగా, విద్యార్థినులు అస్వస్థతకు గురైన విషయం వాస్తవమేనని తెలిపారు. విద్యార్థినులు కంగారు పడుతున్నారని జిల్లా వైద్యాధికారి దృష్టికి తీసుకెళ్లారు. ఆరోగ్యం మెరుగుపడేంత వరకు విద్యార్థినులకు వైద్య చికిత్సలు అందించాలని ఆదేశించారు. అన్ని విధాల వైద్య పరీక్షలు నిర్వహించి, ఆరోగ్యం కుదుటపడేంతవరకు వైద్యుల పర్యవేక్షణలో ఉంచాలని సూచించారు. అనంతరం ఆసుపత్రి నుంచి మహాత్మా జ్యోతిబాఫూలే హాస్టల్‌ను తనిఖీ చేశారు. ఆహార భద్రత శాఖ అధికారితో కలిసి విచారణ చేపట్టనున్నట్లు వివరాలు వెల్లడించారు.

ఉడికిన అన్నంలో పురుగులు, రాళ్లు వస్తున్నాయి..

హాస్టల్‌లో ప్రతిరోజూ వడ్డించే అన్నంలో పురుగులు, రాళ్లు వస్తున్నట్లు విద్యార్థినులు భయపడుతూ విషయాన్ని బయటపెట్టారు. బుధవారమే హాస్టల్‌లో ఫుడ్ కమిటీ సమావేశం జరిగినట్లు తెలిపారు. ఈ సమావేశంలో అన్నంలో పురుగులు, రాళ్లు వస్తున్నట్లు హాస్టల్ ఎస్.ఓ., వార్డెన్ దృష్టికి కమిటీ ద్వారా తీసుకువెళ్లినట్లు విద్యార్థినులు వాపోయారు. విద్యార్థినులకు ఫుడ్ పాయిజన్ జరిగిన విషయాన్ని తల్లిదండ్రులకు తెలియజేయకపోవడం పై వారు మండిపడుతున్నారు. హాస్టల్‌పై జిల్లా అధికారుల పర్యవేక్షణ లేకపోవడమే ఇందుకు కారణమని విమర్శలు గుప్పిస్తున్నారు.

Next Story