మోడీ నివాసం ముందు కాంగ్రెస్ ధర్నా ఓ కపట నాటకం: సోనమ్ వాంగ్‌చుక్ భార్య

by Prasad Jukanti |

ప్రధాని ఇంటి వద్ద కాంగ్రెస్ నిరసనపై సోనమ్ వాంగ్‌చుక్ భార్య గీతాంజలి మండిపడ్డారు. రాజకీయ ప్రయోజనాల కోసం తన భర్త పేరును వాడుకోవద్దని స్పష్టం చేశారు.

మోడీ నివాసం ముందు కాంగ్రెస్ ధర్నా ఓ కపట నాటకం: సోనమ్ వాంగ్‌చుక్ భార్య
X

దిశ, డైనమిక్ బ్యూరో: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నివాసం వద్ద గత మంగళవారం కాంగ్రెస్ నాయకులు చేపట్టిన ఆకస్మిక ధర్నాపై ప్రముఖ విద్యావేత్త, సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ భార్య గీతాంజలి అంగ్మో తీవ్రంగా స్పందించారు. కాంగ్రెస్ చేపట్టిన ఈ ఆందోళనలో ఎటువంటి నిబద్ధత, ప్రామాణికత లేవని, రాజకీయ ప్రయోజనాల కోసమే ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని ఆమె ఆరోపించారు. ప్రధాని నివాసం వద్ద కాంగ్రెస్ నిరసన ఓ కపట నాటకం అని ధ్వజమెత్తారు. ఓ జాతీయ మీడియాతో మాట్లాడిన ఆమె.. రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అగ్రనేతలకు విద్యార్థుల సమస్యలపై నిజమైన బాధ్యత ఉంటే వారు జంతర్ మంతర్ వద్ద ధర్నా చేస్తున్న విద్యార్థులతో కలిసి నిలబడాల్సిందన్నారు.

వాంగ్ చుక్ పేరును స్వార్థం కోసం వాడుకోవద్దు:

నీట్ పేపర్ లీకేజీపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ రాజీనామా చేయాలంటూ కాక్రోచ్ జనతా పార్టీ విద్యార్థులకు మద్దతుగా 26 రోజులకు పైగా సోనమ్ వాంగ్‍చుక్ నిరాహార దీక్ష చేపట్టారు. ఆయన ఆరోగ్యం క్షీణిస్తున్నా ఆసుపత్రిలో నుంచే తన దీక్షను కొనసాగిస్తున్నారని, ఇటువంటి పరిస్థితుల్లో ఈ నిరసనల్లో రాజకీయ పార్టీలు రంగ ప్రవేశం చేయడంపై వాంగ్‌చుక్ భార్య పలు కీలక వ్యాఖ్యలు చేశారు. రాజకీయ నాయకులు వాంగ్‌చుక్ పేరును, ఆయనకున్న ప్రజాదరణను స్వార్థం కోసం వాడుకోవాలని చూస్తున్నారని ప్రజలను మభ్య పెట్టడం ఇక సాధ్యం కాదని అన్నారు. ప్రధాని నివాసం వద్ద జరిగిన నిరసనలో ఎటువంటి నిజాయితీ లేదన్నారు. దేశంలో ఇప్పుడు చైతన్యవంతమైన పౌరులు ఉన్నారని ప్రజలను ఇక ఎంతమాత్రం మూర్ఖులను చేయలేరని స్పష్టం చేశారు. కపట నాటకాలు ఆడే నాయకులను దేశ యువత ఖచ్చితంగా తిరస్కరిస్తుందన్నారు.

అలాంటి వారే మాతో కలిసి రావాలి:

సీజేపీ సారథ్యంలో నిరసనలు రాజకీయ పక్షాలకు గట్టి సందేశం పంపించాయని ఆమె అన్నారు. తమ దృష్టిలో పార్లమెంటే అత్యున్నత వ్యవస్థ అని, తమకు ఇక ప్రతిపక్షం, పాలకపక్షం లేదని వ్యాఖ్యానించారు. పార్లమెంటే ఈ అంశంపై దృష్టి సారించాలని కోరుతున్నామని అన్నారు. రాజకీయ లక్ష్యాలు లేని వారు తమతో కలిసి రావచ్చని పిలుపునిచ్చారు. సొంత ఎజెండాలతో వచ్చే వారు స్వచ్ఛందంగా పక్కకు తప్పుకోవాల్సి వస్తుందని అన్నారు.

Next Story