ఆయిల్ పామ్ సాగు విస్తీర్ణం పెంపుపై దృష్టి సారించాలి

by Ratna Kumari |

జిల్లాలో నిర్దేశించిన లక్ష్యానికి అనుగుణంగా ఆయిల్ పామ్ సాగు విస్తీర్ణాన్ని పెంచేందుకు అధికారులు ప్రణాళికాబద్ధంగా పనిచేయాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశించారు.

ఆయిల్ పామ్ సాగు విస్తీర్ణం పెంపుపై దృష్టి సారించాలి
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : జిల్లాలో నిర్దేశించిన లక్ష్యానికి అనుగుణంగా ఆయిల్ పామ్ సాగు విస్తీర్ణాన్ని పెంచేందుకు అధికారులు ప్రణాళికాబద్ధంగా పనిచేయాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశించారు. క్షేత్రస్థాయిలో రైతులను ప్రోత్సహిస్తూ ప్రస్తుత సీజన్‌లో 2 వేల ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు జరిగేలా చర్యలు చేపట్టాలని సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని వీడియో కాన్ఫరెన్స్ హాల్‌లో శుక్రవారం వ్యవసాయ, ఉద్యానవన శాఖల అధికారులు, ఆయిల్ పామ్ నర్సరీ నిర్వహిస్తున్న ప్రీ-యునిక్ కంపెనీ ప్రతినిధులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. ఆయిల్ పామ్ సాగు పురోగతిని క్లస్టర్ల వారీగా సమీక్షించిన ఆమె, నందిపేట మండలం లక్కంపల్లి సెజ్‌లో ప్రతిపాదిత ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు గుర్తించిన స్థలం అనుకూలతపై చర్చించారు.

భవిష్యత్తులో రిఫైనరీ ఏర్పాటుకు కూడా తగిన స్థలం అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటూ, పొరుగు జిల్లాలకు కేంద్రంగా ఉండే లక్కంపల్లి సెజ్‌లో ఫ్యాక్టరీ ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు. అలాగే రైతులకు సౌకర్యంగా ఉండే ప్రాంతాల్లో ఆయిల్ పామ్ పంట సేకరణ కేంద్రాలు ఏర్పాటు చేయాలని ప్రీ-యునిక్ కంపెనీ ప్రతినిధులను ఆదేశించారు. ఆయిల్ పామ్ రైతులకు అధిక లాభాలు అందించే పంట అని, రైతుల ఆదాయాన్ని పెంచడమే ప్రభుత్వ లక్ష్యమని కలెక్టర్ పేర్కొన్నారు. జిల్లాలో రైతులు స్వచ్ఛందంగా ఆయిల్ పామ్ సాగు చేపట్టేలా విస్తృత స్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు.

ముఖ్యంగా మాక్లూర్, డిచ్‌పల్లి, బాల్కొండ, ముప్కాల్, మెండోరా, సిరికొండ మండలాల్లో ప్రత్యేక దృష్టి సారించి, ఒక్కో మండలంలో కనీసం 100 ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు జరిగేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. వరి సాగుకు ప్రత్యామ్నాయంగా ఆయిల్ పామ్ సాగును ప్రోత్సహించాలని, క్షేత్రస్థాయిలో వ్యవసాయ అధికారులు రైతులను కలిసి పంట ప్రయోజనాలపై అవగాహన కల్పించాలని సూచించారు. రైతు వేదికల్లో ప్రత్యేక సదస్సులు నిర్వహించి, ప్రభుత్వం అందిస్తున్న రాయితీలు, మద్దతు ధర, దీర్ఘకాలిక ఆదాయం, అంతర పంటల సాగు అవకాశాలపై రైతులకు వివరించాలని తెలిపారు. జిల్లాలో అవసరమైన మేరకు ఆయిల్ పామ్ మొక్కలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ సమావేశంలో ట్రైనీ కలెక్టర్ సురేష్, జిల్లా ఉద్యానవన శాఖ అధికారి శ్రీనివాస్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి వీరస్వామి, ప్రీ-యునిక్ కంపెనీ ఏరియా మేనేజర్ సాయి కిరణ్, ఉద్యానవన, వ్యవసాయ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Next Story