మర్పల్లి అభివృద్ధికి నిధుల వరద

by Ratna Kumari |

మర్పల్లి మండల సమగ్ర అభివృద్ధికి నిధుల కొరత రానివ్వబోమని, అవసరమైనన్ని నిధులు మంజూరు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని తెలంగాణ శాసనసభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ స్పష్టం చేశారు.

మర్పల్లి అభివృద్ధికి నిధుల వరద
X

దిశ, మర్పల్లి : మర్పల్లి మండల సమగ్ర అభివృద్ధికి నిధుల కొరత రానివ్వబోమని, అవసరమైనన్ని నిధులు మంజూరు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని తెలంగాణ శాసనసభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ స్పష్టం చేశారు. మర్పల్లి మండల సర్పంచుల సంఘం నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన ఎండీ రఫీయోద్దీన్, కార్యవర్గ సభ్యులు సోమవారం స్పీకర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా స్పీకర్ మాట్లాడుతూ నియోజకవర్గ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉందని, శాసనసభాపతిగా, స్థానిక ఎమ్మెల్యేగా తాను ఎల్లప్పుడూ ప్రజలకు, ప్రజాప్రతినిధులకు అందుబాటులో ఉంటానని భరోసా ఇచ్చారు. "గ్రామాల్లో ఏ సమస్య ఉన్నా, ఏ విధమైన మౌలిక సదుపాయాలు అవసరమైనా వెంటనే నా దృష్టికి తీసుకురండి. ప్రాధాన్యత క్రమంలో నిధులు మంజూరు చేసి మర్పల్లిని ఆదర్శ మండలంగా తీర్చిదిద్దుకుందాం" అని స్పీకర్ పిలుపునిచ్చారు. నూతనంగా ఎన్నికైన సర్పంచుల సంఘం ప్రతినిధులు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌ను శాలువా, పూలమాలతో ఘనంగా సత్కరించారు. అనంతరం స్పీకర్ సైతం సర్పంచుల సంఘం కార్యవర్గ సభ్యులను శాలువాలతో సన్మానించి, తమ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గూడెం రాములు యాదవ్, జిల్లా పార్టీ ఉపాధ్యక్షులు యు. రవీందర్, గ్రంథాలయ సంస్థ మాజీ అధ్యక్షుడు ఎస్. కొండల్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు సురేష్‌తో పాటు పలువురు సర్పంచులు, మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Next Story