- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఎల్ నినో ఎఫెక్ట్.. ఎండిపోతున్న చెరువులు
ఎల్‌నినో ఎఫెక్ట్ చేప పిల్లల పంపిణీపై నీలి నీడలు కమ్ముకున్నాయి.

దిశ, కాటారం: ఎల్‌నినో ఎఫెక్ట్ చేప పిల్లల పంపిణీపై నీలి నీడలు కమ్ముకున్నాయి. చేప పిల్లలు ఒడ్డున పడి విలవిలలాడేలా మత్స్యకారుల జీవితాల పరిస్థితి ఉంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో వ్యవసాయ రంగంతో పాటు కులవృత్తులపై ఎల్‌నినో తీవ్ర ప్రభావం చూపుతోంది. అంతా ఆకాశం వైపు చూస్తున్నారు. వర్షాలు లేక ఎండలు మండుతుండడంతో భూగర్భ నీటిమట్టం తగ్గుతుంది. చెరువులు సైతం ఎండిపోతున్నాయి. ఉచిత చేప పిల్లల పంపిణీ పై కరువు నీడలు కమ్ముకోవడంతో గంగ పుత్రులు, ముదిరాజులలో నిరాశ వ్యక్తమవుతోంది. వర్షాకాల ప్రారంభమై రెండు నెలలు దగ్గర పడుతున్నా భారీ వర్షాలు లేక ప్రాజెక్టులు, చెరువులు, కుంటలు వెలవెలబోతున్నాయి.
సకాలంలో వర్షాలు కురవకపోవడంతో ప్రాజెక్టులు, చెరువులు, కుంటల్లోకి నీరు చేరకపోవడంతో జిల్లాలో మత్స్య సంపదపై తీవ్ర ప్రభావం పడనుంది. ఈ ఏడాది చేప పిల్లల పెంపకం ముందుకు సాగుతుందా అనే సందేహం మత్స్యకారులను వెంటాడుతుంది. ఎల్ నినో ప్రభావంతో ఇప్పటివరకు టెండర్లు ఖరారు చేయలేదు. ఎన్ని చేప పిల్లలు పంపిణీ చేయాలి అనే విషయమై అధికారులు స్పష్టత ఇవ్వలేదు. దీంతో చేప పిల్లల పంపిణీ జరిగే అవకాశాలు కనిపించడం లేదు. ఎల్ నినో ఎఫెక్ట్‌తో ప్రభుత్వం కూడా చేప పిల్లల పంపిణీకి ఆదేశాలు జారీ చేయకపోవడంతో ఒకవైపు అధికారులు మరోవైపు మత్స్య కార్మికులు సందిగ్ధంలో పడ్డారు. ప్రత్యామ్నాయ మార్గాలపై కార్మికులు దృష్టి సారిస్తున్నారు.
ఉపాధి అవకాశాలు కోల్పోతుండడంతో వేరే పనులు చేసుకోకపోతే కుటుంబాలు గడవడం కష్టమని భావించిన మత్య కార్మికులు ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషిస్తున్నారు. జీవనోపాధిపై ప్రభావం చూపుతుండడంతో ఇతర మార్గాలు వెతుక్కోక తప్పటం లేదు. రెక్కాడితే కానీ డొక్కాడని మత్స్య కార్మికులు తీవ్ర వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో ఆందోళన చెందుతున్నారు. ఎల్నీనో ప్రభావంతో చేప పిల్లలను చెరువుల్లో పోయకపోతే పరిస్థితి ఏంటా అని ఆలోచనలో పడ్డారు.ఎల్నీనో ఎఫెక్ట్ ఎండిపోతున్న చెరువులు చేప పిల్లల పంపిణీ పై ఇటీవల కాటారం మండల కేంద్రంలోని ఓ మత్స్యకారుడు ఆత్మహత్యాయత్నం ఆందోళన కలిగిస్తుంది.
వెలవెలబోతున్న చెరువులు, కుంటలు..
ఎలినినో ప్రభావంతో వర్షాలు సమృద్ధిగా కురవకపోవడంతో జిల్లాలోని చెరువులు, కుంటలు వెలవెలబోతున్నాయి. జిల్లాలో ఇప్పటికి భారీ వర్షాలు కురవలేదు. మోస్తారు వర్షాలతో సగటు వర్షపాతం కూడా ఇప్పటివరకు దాటలేదు.ప్రతి సంవత్సరం ఈ పాటికి చెరువులకు జలకళ సంతరించుకునేది. వర్షాలు లేకపోవడంతో ఎండిపోయే పరిస్థితికి వచ్చాయి.చెరువుల కింద పంటల సాగు కూడా ముందుకు సాగే పరిస్థితి కనిపించడం లేదు. తాగు, సాగునీటి సమస్య కూడా ఏర్పడుతుంది. రైతులు కూడా వ్యవసాయ భూములను చెరువుల కింద భీళ్లుగా ఉంచే పరిస్థితులు నెలకొంటున్నాయి.
చెరువుల్లో చేప పిల్లలను వదిలే కార్యక్రమాలకు తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఏర్పడటం తో మత్స్య కార్మికులు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నారు. ఒక దశలో వలస వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. సంబంధిత శాఖ అధికారులు మాత్రం ఎన్ని చెరువుల్లో చేప పిల్లలను వదలాలి ఎన్ని చేప పిల్లలు అవసరం అవుతాయి అంచనాలు వేసి సిద్ధంగా ఉంచారు. కానీ ఎల్ నినో ప్రభావంతో టెండర్ల ప్రక్రియ ప్రారంభించలేదు. ప్రతి సంవత్సరం జూన్, జూలై మాసాల్లో టెండర్లను ఆహ్వానించి కాంట్రాక్టర్లను నిర్ణయిస్తారు. ఈ రెండు మాసాల్లో వర్షాలు బాగా కృషి చెరువులు నిండగానే ఆగస్టులో చెరువుల్లో చేప పిల్లలను వదులుతారు. అదునులో చేప పిల్లలను చెరువుల్లోకి వదిలితేనే ఆశించిన దిగుబడి వస్తుంది. లేని పక్షంలో మత్స్య కార్మికులు నష్టపోవాల్సిన పరిస్థితి నెలకొంటుంది.
చేప పిల్లల ఎదుగుదలపై ప్రభావం..
వర్షాకాలం ఆరంభంలోనే సమృద్ధిగా వర్షాలు కురిస్తే చెరువులు, కుంటలలోకి నీరు చేరడంతోనే ఉచిత చేప పిల్లలు వదిలితే ఉత్పత్తి పెరుగుతుందని మత్స్యకారులు అంటున్నారు. చేపలు కిలో వరకు సైజు పెరగాలంటే కనీసం 6 నెలల సమయం పడుతుంది. జూలై, ఆగస్టు మాసాల్లో చేప పిల్లలను వదిలితేనే విక్రయించే అవకాశాలు ఉంటాయని సెప్టెంబర్, అక్టోబర్ మాసాలలో చేప పిల్లలు వేస్తే ఎదిగే అవకాశాలు తక్కువగా ఉంటాయని మత్స్యకారులు చెబుతున్నారు. తీవ్ర వర్షాభావ పరిస్థితులతో మత్స్యకారులు, వ్యవసాయ రంగంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. వర్షాలు లేక అన్నదాత ఆకాశం వైపు చూస్తుండగా మత్స్య కార్మికులు ఉపాధి కోల్పోతున్నారు. ఈ సంవత్సరం వర్షాలు కురిస్తేనే ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చిన తర్వాత టెండర్లను ప్రకటించి చేప పిల్లల పంపిణీకి చర్యలు తీసుకుంటామని సంబంధిత శాఖ అధికారులు అంటున్నారు. పరిస్థితులు చూస్తే మాత్రం చేప పిల్లల పంపిణీ ప్రక్రియ ముందుకు సాగుతుందా అనే సందేహం మాత్రం మత్స్య కార్మికులను వెంటాడుతుంది.






