శబరిమల కేసుపై సుప్రీంకోర్టులో తుది విచారణ షురూ: 9 మంది న్యాయమూర్తుల బెంచ్ కీలక సమీక్ష!

by Malleboina Mahesh |

శబరిమల ఆలయ ప్రవేశంపై సుప్రీంకోర్టులో 9 మంది సభ్యుల ధర్మాసనం తుది విచారణ ప్రారంభం. ఏప్రిల్ 22 వరకు కొనసాగనున్న వాదనలు.

శబరిమల కేసుపై సుప్రీంకోర్టులో తుది విచారణ షురూ: 9 మంది న్యాయమూర్తుల బెంచ్ కీలక సమీక్ష!
X

దిశ, వెబ్ డెస్క్: దేశ వ్యాప్తంగా ఉత్కంఠ రేపుతున్న శబరిమల అయ్యప్ప స్వామి ఆలయ ప్రవేశం, మతపరమైన ఆచారాల పరిధి పై సుప్రీంకోర్టులో తుది విచారణను ప్రారంభించింది. భారత ప్రధాన న్యాయమూర్తి (CJI) జస్టిస్ సూర్య కాంత్ నేతృత్వంలోని తొమ్మిది మంది సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఈ కీలక రివ్యూ పిటిషన్లపై విచారణ చేపట్టింది. ఈ బెంచ్‌లో జస్టిస్ బి.వి. నాగరత్న, జస్టిస్ ఎం.ఎం. సుందరేష్, జస్టిస్ ఆర్. మహదేవన్ వంటి ప్రముఖ న్యాయమూర్తులు సభ్యులుగా ఉన్నారు. 2018 లో అన్ని వయసుల మహిళలకు ప్రవేశం కల్పిస్తూ ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ దాఖలైన 66 పిటిషన్లను ఈ ధర్మాసనం విశ్లేషించనుంది.

ఈ విచారణ కేవలం శబరిమలకే పరిమితం కాకుండా, మత స్వేచ్ఛ (ఆర్టికల్ 25, 26), రాజ్యాంగ నైతికత మధ్య ఉన్న సరిహద్దులను నిర్ణయించనుంది. ముస్లిం మహిళల మసీదు ప్రవేశం, పార్సీ మహిళల హక్కులు, ఇతర మతపరమైన సున్నితమైన అంశాలకు సంబంధించి ఏడు కీలక ప్రశ్నలను ధర్మాసనం పరిష్కరించనుంది. కేంద్ర ప్రభుత్వం ఈ విచారణలో భాగంగా తన లిఖితపూర్వక వాదనలను సమర్పిస్తూ.. శబరిమల ఆచారాలు మతపరమైన స్వయంప్రతిపత్తికి సంబంధించినవని, ఇందులో న్యాయపరమైన జోక్యం పరిమితంగా ఉండాలని కోరింది. ఏప్రిల్ 22 నాటికి ఈ వాదనలు ముగిసే అవకాశం ఉందని కోర్టు తెలిపింది.

Next Story