- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రోడ్డు పై నదిలా పారుతున్న మురికి నీరు
ఇటీవల జీహెచ్‌ఎంసీలో విలీనమైన ముత్తంగిలో పారిశుద్ధ్య పనులు అటకెక్కాయి.

దిశ, పటాన్‌చెరు టౌన్ : ఇటీవల జీహెచ్‌ఎంసీలో విలీనమైన ముత్తంగిలో పారిశుద్ధ్య పనులు అటకెక్కాయి. ముత్తంగి పరిధిలోని శ్రీనివాస్‌నగర్ కాలనీలో గత 15 రోజులుగా డ్రైనేజీ కాలువలు నిండిపోయి, రోడ్డుపై మురుగు నీరు నదిలా ప్రవహిస్తున్నా పట్టించుకునేవారు కరువయ్యారు. దీంతో స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మురుగు కాల్వలు నిండిపోవడంతో వాటిని శుభ్రం చేయాలని పలుమార్లు జీహెచ్‌ఎంసీ అధికారులకు, స్థానిక ప్రజాప్రతినిధులకు ఫిర్యాదు చేసినప్పటికీ కనీసం స్పందించడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు ఇస్నాపూర్ మున్సిపాలిటీలో పారిశుద్ధ్య పనులు చకచకా కొనసాగుతుండగా, ఈ కాలనీ జీహెచ్‌ఎంసీ పరిధిలో ఉండడంతో ఇటు మున్సిపల్ సిబ్బంది, అటు జీహెచ్‌ఎంసీ అధికారులు కూడా పట్టించుకున్న పాపాన పోలేదని వారు వాపోతున్నారు.
కాలనీలో డ్రైనేజీ వ్యవస్థ సక్రమంగా లేకపోవడంతో ఇళ్ల ముందు కాల్వలు నిండిపోయి, మురుగు నీరంతా రోడ్డుపైకి చేరుతుండటంతో కనీసం నడవడానికి కూడా వీలు లేకుండా మారిందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నదిలా ప్రవహిస్తున్న మురికి నీటి వల్ల నీరు నిలిచి తీవ్ర దుర్వాసన వెదజల్లుతోందని, దీంతో తాము పలు రకాల అనారోగ్య సమస్యలకు గురవుతున్నామని తెలిపారు. ఇదే వీధిలో ప్రైవేట్ పాఠశాల ఉండటంతో ప్రతిరోజూ పాఠశాలకు వెళ్లే విద్యార్థులకు తీవ్ర అసౌకర్యంగా మారిందన్నారు. తమ పిల్లలు మురుగు నీటిలోంచే నడుచుకుంటూ పాఠశాలకు వెళ్తున్నారని పలువురు తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో నీటిలో జారి పలువురు చిన్నారులు గాయపడిన సందర్భాలు కూడా ఉన్నాయని వారు తెలిపారు. స్థానిక ప్రజల, చిన్నారుల ఆరోగ్యం, భద్రతపై అధికారులు దృష్టి సారించాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా జీహెచ్‌ఎంసీ అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు వెంటనే నిండిపోయిన డ్రైనేజీ కాలువలను శుభ్రపరచి, రోడ్డుపై ప్రవహిస్తున్న మురుగు నీటిని నిలువరించి, దోమలు వ్యాప్తి చెందకుండా పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలని స్థానిక ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.






