రూటు మార్చిన వైద్యశాఖ.. ఉద్యోగాల భర్తీకి కొత్త ప్లాన్

by Disha Web Desk |
రూటు మార్చిన వైద్యశాఖ.. ఉద్యోగాల భర్తీకి కొత్త ప్లాన్
X

దిశ, తెలంగాణ బ్యూరో : అసెంబ్లీ ఎన్నికలే టార్గెట్‌గా వైద్యారోగ్యశాఖలో భర్తీలు జరగనున్నాయి. కొత్త నియామకాలు జరగడం లేదని కొన్నేళ్లుగా కోర్సులు పూర్తి చేసిన డాక్టర్లు, నర్సులు, పారమెడికల్ స్టాఫ్​సర్కార్ పై గుర్రుగా ఉన్నారు. ఈ ప్రభావం రాబోయే ఎన్నికల్లో పడకూడదని వేగంగా ఖాళీలను నింపేందుకు ప్రత్యేక ప్లాన్​ చేస్తున్నారు. ప్రభుత్వం గుర్తించిన 12,755 ఖాళీలను గరిష్ఠంగా కేవలం మూడు నెలల్లోనే పూర్తి చేయాలని లక్ష్యం పెట్టుకున్నారు. టీఎస్​పీఎస్సీ ద్వారా భర్తీ ప్రక్రియ ఆలస్యమవుతుండటంతో ఈ సారి మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డు(ఎంహెచ్‌ఎస్‌ఆర్‌‌బీ) ద్వారా ఉద్యోగాలు భర్తీ చేయనున్నారు.

వైద్యవిభాగంపై మెడికల్​ బోర్డు స్టాఫ్​ కు పూర్తి స్థాయిలో పట్టు ఉన్న నేపథ్యంలో వేగంగా భర్తీలు జరుగుతాయని ప్రభుత్వం ఆశీస్తున్నది. ఇప్పటికే సర్కార్ మెడికల్​ బోర్డుకు అంతర్గత ఆదేశాలిచ్చినట్లు సమాచారం. రెండు మూడు రోజుల్లో ఉద్యోగాల భర్తీకి ప్రక్రియ షురూ కానున్నట్లు ఓ ఉన్నతాధికారి 'దిశ'కు తెలిపారు. డైరెక్టర్​ఆఫ్​పబ్లిక్​ హెల్త్, డైరెక్టర్​ఆఫ్​మెడికల్​ఎడ్యుకేషన్, తెలంగాణ వైద్య విధాన పరిషత్​ విభాగాల్లోని ఖాళీలను బోర్డు ద్వారానే నింపుతామని చెప్పారు.

నర్సుల ఖాళీలే ఎక్కువ...

హెల్త్​ డిపార్ట్​మెంట్లో అత్యధికంగా స్టాఫ్​నర్సు పోస్టులే ఖాళీగా ఉన్నాయి. మెడికల్​ఎడ్యుకేషన్​పరిధిలో 4400, టీవీవీపీలో 700, డైరెక్టర్​ఆఫ్​పబ్లిక్​ హెల్త్‌లో దాదాపు మరో 1600 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు తెలిసింది. అంటే ప్రభుత్వం గుర్తించిన ఖాళీల మొత్తంలో దాదాపు సగం పోస్టులు స్టాఫ్​నర్సు ఖాళీలే. ఈ పోస్టుల కొరకు సుమారు 25 వేల మంది వరకు పోటి పడే అవకాశం ఉన్నట్లు ఉన్నతాధికారులు అంచనా వేస్తున్నారు. ఇక

టీచింగ్​ఆసుపత్రుల్లో 1600 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు, టీవీవీపీ పరిధిలో ఉండే జిల్లా, ఏరియా ఆసుపత్రుల్లో 12 వందల సివిల్ అసిస్టెంట్ సర్జన్(స్పెషలిస్ట్‌) పోస్టులు, డైరెక్టర్ ఆఫ్​ పబ్లిక్​ హెల్త్​లో 800 మెడికల్ ఆఫీసర్ పోస్టులు, ల్యాబ్ టెక్నీషియన్, ఫార్మసిస్ట్‌, పారామెడికల్, అడ్మినిస్ర్టేటీవ్‌, తదితర పోస్టులన్ని కలిపి సుమారు 2500 వరకూ ఉంటాయని ఓ అధికారి చెప్పారు. అయితే వీటన్నింటిని విడతల వారీగా భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది.

Next Story

Most Viewed