- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రైతుల అవసరాలకు సరిపడా ఎరువుల నిల్వలు : కలెక్టర్ ఇలా త్రిపాఠి
జిల్లాలో ఖరీఫ్ సీజన్ పంటల సాగు కోసం రైతుల అవసరాలకు సరిపడా యూరియా నిల్వలు అందుబాటులో ఉన్నాయని, ఎరువుల విషయంలో ఎవరు కూడా ఆందోళనకు గురి కావాల్సిన అవసరం లేదని కలెక్టర్ ఇలా త్రిపాఠి భరోసా కల్పించారు.

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : జిల్లాలో ఖరీఫ్ సీజన్ పంటల సాగు కోసం రైతుల అవసరాలకు సరిపడా యూరియా నిల్వలు అందుబాటులో ఉన్నాయని, ఎరువుల విషయంలో ఎవరు కూడా ఆందోళనకు గురి కావాల్సిన అవసరం లేదని కలెక్టర్ ఇలా త్రిపాఠి భరోసా కల్పించారు. జిల్లాలో ఎక్కడ కూడా యూరియా కొరత లేదని, రాష్ట్రంలోని ఇతర అన్ని జిల్లాల కంటే నిజామాబాద్ జిల్లాలోనే అత్యధిక స్థాయిలో 27,203 మెట్రిక్ టన్నుల యూరియా నిల్వలు అందుబాటులో ఉన్నాయని సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. అన్ని ప్రాంతాల్లో రైతులకు ఎరువులు పంపిణీ జరిగేలా ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తున్నామని, పంట సాగు చేసే ప్రతి రైతుకు ఎరువులు అందేలా చూస్తామని అన్నారు.
ఎలాంటి అక్రమాలకు తావు లేకుండా, ఎరువులు పక్కదారి పట్టకుండా పారదర్శకమైన పంపిణీ కోసం యూరియా బుకింగ్ యాప్ దోహదపడుతోందని అన్నారు. ఈ యాప్ పనితీరును గమనించిన ఇతర రాష్ట్రాలు కూడా ఒక్క యూరియానే కాకుండా మిగతా అన్ని ఎరువులను కూడా బుకింగ్ యాప్ ద్వారానే రైతులకు అందిస్తున్నాయని కలెక్టర్ తెలిపారు. ఈ యాప్ ద్వారా ఆయా మండలాల్లో ఏ డీలర్ వద్ద యూరియా అందుబాటులో ఉంది అనే సమాచారం తెలుసుకునే వెసులుబాటు ఉందని, రైతులు సమీప డీలర్ల వద్ద పంట సాగు విస్తీర్ణానికి అనుగుణంగా అవసరమైన యూరియాను బుక్ చేసుకోవచ్చని సూచించారు. అంతేకాకుండా ప్రతి సొసైటీ వద్ద, ప్రతీ డీలర్ షాప్ లో ఎరువుల నిల్వల వివరాలను తెలియజేసేలా స్టాక్ బోర్డులు ప్రదర్శించేలా చర్యలు తీసుకున్నామని అన్నారు.
నకిలీ, నాసిరకం ఎరువులు, విత్తనాలకు ఆస్కారం లేకుండా మండల స్పెషల్ ఆఫీసర్లతో పాటు తహసిల్దార్లు, ఇతర అధికారులతో నిరంతరం తనిఖీలు జరిపిస్తున్నామని కలెక్టర్ తెలిపారు. రైతులు ఒకేసారి ఎరువులను కొనుగోలు చేసి అట్టిపెట్టుకోకుండా, తమ అవసరాలకు అనుగుణంగా దశల వారీగా ఎరువులు తీసుకోవాలని, మోతాదుకు మించి వాడవద్దని హితవు పలికారు. ఎరువుల దుకాణాలు, వివిధ సంస్థల ద్వారా యూరియా, ఇతర ఎరువులు కొనే రైతులకు వారి అంగీకారం లేకుండా వేరే ఏ రకమైన ఇతర ఉత్పత్తులను కొనుగోలు చేయాలని ఒత్తిడి చేయకూడదని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చామని అన్నారు. యూరియా ఎరువులతో ముడిపెడుతూ ఇతర ఉత్పత్తులను కొనుగోలు చేయాలని రైతులను బలవంతం చేస్తే డీలర్ల లైసెన్సులు రద్దు చేస్తామని కలెక్టర్ హెచ్చరించారు.






