విద్యా సేవలో అంకితభావానికి రాష్ట్ర స్థాయి గుర్తింపు..

by Kodari Anjali |

విద్యార్థుల విద్యాాభివృద్ధి, సంక్షేమం కోసం విశేష కృషి చేసిన బహదూర్‌పల్లి జెడ్పీ ఉన్నత పాఠశాల పాఠశాల సహాయకుడు కె. శ్రీనివాస్ రెడ్డికి తెలంగాణ పాఠశాల విద్యాశాఖ రాష్ట్ర స్థాయి ప్రశంసా పత్రాన్ని అందజేసింది.

విద్యా సేవలో అంకితభావానికి రాష్ట్ర స్థాయి గుర్తింపు..
X

దిశ, మేడ్చల్ బ్యూరో: విద్యార్థుల విద్యాాభివృద్ధి, సంక్షేమం కోసం విశేష కృషి చేసిన బహదూర్‌పల్లి జెడ్పీ ఉన్నత పాఠశాల పాఠశాల సహాయకుడు కె. శ్రీనివాస్ రెడ్డికి తెలంగాణ పాఠశాల విద్యాశాఖ రాష్ట్ర స్థాయి ప్రశంసా పత్రాన్ని అందజేసింది. విద్యార్థుల సమగ్ర వికాసానికి అంకితభావంతో సేవలందిస్తూ విద్యారంగంలో ఆదర్శంగా నిలిచినందుకు ఈ గౌరవాన్ని ప్రదానం చేసినట్లు విద్యాశాఖ వెల్లడించింది. విధి నిర్వహణకే పరిమితం కాకుండా విద్యార్థులకు అవసరమైన విద్యా వనరులు సమకూర్చడం, అభ్యాసానికి అనుకూల వాతావరణాన్ని కల్పించడం, వినూత్న కార్యక్రమాలను అమలు చేయడం ద్వారా శ్రీనివాస్ రెడ్డి ప్రత్యేక గుర్తింపు పొందారు. విద్యార్థుల్లో చదువుపై ఆసక్తి పెంపొందించడంతో పాటు వారి ప్రతిభను వెలికితీసే కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇచ్చారని ప్రశంసా పత్రంలో పేర్కొన్నారు.

జిల్లాకు గర్వకారణంగా నిలిచింది...

విద్యారంగంలో ఆయన అందిస్తున్న నిస్వార్థ సేవలు, నిరంతర కృషి ఇతర ఉపాధ్యాయులకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నాయని, పాఠశాలల అభివృద్ధితో పాటు విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తు నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తున్నారని విద్యాశాఖ కొనియాడింది. తెలంగాణ పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ డాక్టర్ ఈ నవీన్ నికోలస్ చేతుల మీదుగా శ్రీనివాస్ రెడ్డి ప్రశంసా పత్రాన్ని అందుకున్నారు. ఈ సందర్భంగా సహచర ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు, స్థానికులు హర్షం వ్యక్తం చేస్తూ ఆయనను అభినందించారు. శ్రీనివాస్ రెడ్డికి లభించిన రాష్ట్ర స్థాయి గుర్తింపు పాఠశాలకు, జిల్లాకు గర్వకారణంగా నిలిచిందని పలువురు పేర్కొన్నారు.

Next Story