మహిళా పోలీసులకు ఫీల్డ్ డ్యూటీలు.. డీజీపీ సీవీ ఆనంద్ కీలక ఆదేశాలు

by Ramesh Naini |

రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణ, నేర నియంత్రణ, పోలీసు శాఖ పునర్వ్యవస్థీకరణ, భద్రతాపరమైన అంశాలు, పోలీస్ స్టేషన్ల సరిహద్దుల గుర్తింపు, డొమెస్టిక్ సర్వెంట్స్ వివరాల సేకరణ పలు అంశాలపై సోమవారం రాష్ట్ర డీజీపీ కార్యాలయం డీజీపీ సీవీ ఆనంద్ స్టాఫ్ ఆఫీసర్లతో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు.

మహిళా పోలీసులకు ఫీల్డ్ డ్యూటీలు.. డీజీపీ సీవీ ఆనంద్ కీలక ఆదేశాలు
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణ, నేర నియంత్రణ, పోలీసు శాఖ పునర్వ్యవస్థీకరణ, భద్రతాపరమైన అంశాలు, పోలీస్ స్టేషన్ల సరిహద్దుల గుర్తింపు, డొమెస్టిక్ సర్వెంట్స్ వివరాల సేకరణ పలు అంశాలపై సోమవారం రాష్ట్ర డీజీపీ కార్యాలయం డీజీపీ సీవీ ఆనంద్ స్టాఫ్ ఆఫీసర్లతో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ఇటీవలి కాలంలో డొమెస్టిక్ సర్వెంట్స్ చేరుతున్న కొందరు వ్యక్తులు నేరాలకు పాల్పడుతున్న ఉదంతాలను డీజీపీ ప్రస్తావించారు.

మహిళా పోలీసులకు పెద్దపీట..

శాఖలో మహిళా పోలీసుల సేవలను మరింతగా వినియోగించుకునేలా మహిళా పోలీసులకు కల్పిస్తున్న 33 శాతం రిజర్వేషన్‌ను సమర్థవంతంగా అమలు చేయడంతో పాటు, వారికి కేవలం కార్యాలయ విధులకే పరిమితం చేయకుండా లా అండ్ ఆర్డర్, ఫీల్డ్ డ్యూటీలలో కీలక బాధ్యతలు అప్పగించాలని సూచించారు. ఈ క్రమంలోనే అక్టోబరులో రాష్ట్రస్థాయి మహిళా పోలీసు కాన్ఫరెన్స్‌ను, నవంబరులో పోలీస్ ట్రిట్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు వెల్లడించారు.

డొమెస్టిక్ సర్వెంట్స్ డేటాబేస్ సిద్ధం చేయాలి..

ఇతర రాష్ట్రాలతో పాటు నేపాల్ నుంచి వచ్చే వారు ఇంట్లో పనికిలో చేరి నేరాలకు పాల్పడుతున్న నేపథ్యంలో, రాష్ట్రవ్యాప్తంగా డొమెస్టిక్ సర్వెంట్స్ పూర్తి వివరాలను సేకరించాలని ఆదేశించారు. వారు ఎక్కడ ఉంటున్నారు, ఎక్కడ పని చేస్తున్నారు అనే అంశాలతో సమగ్ర డేటాబేస్ రూపొందించాలని సూచించారు. అలాగే కమిషనరేట్లు, పోలీస్ స్టేషన్ల పరిధి, సరిహద్దు గ్రామాల పునర్విభజనపై సంబంధిత అధికారులతో చర్చించారు. ఈ విభజన ప్రజలకు, ఇతర ప్రభుత్వ శాఖలకు అనుకూలంగా ఉండేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని తెలిపారు.

ఏఐ డ్రోన్లు, డేటా ఇంటెలిజెన్స్ వినియోగం..

ఏఐ డ్రోన్ల వినియోగం, డేటా ఇంటెలిజెన్స్ వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. సీసీటీఎన్‌ఎస్ 2.0 అమలు, టీజీ కాప్స్ అప్లికేషన్ల ద్వారా రౌడీషీటర్లు, హిస్టరీ షీటర్లు, వాహనాల తనిఖీ వంటి సేవలను మరింత వేగవంతం చేయాలన్నారు. సీఐడీ వ్యవస్థ బలోపేతం, మాన్యువల్ పద్ధతుల ఆధునీకరణపై అధికారులతో సుదీర్ఘంగా చర్చించారు.

ట్రాఫిక్ మేనేజ్‌మెంట్..

పోలీసు మ్యాన్‌పవర్ మేనేజ్‌మెంట్, వాహనాల ఆడిట్ వంటి అంశాలపై సమీక్షించిన డీజీపీ, భవిష్యత్తు అవసరాల దృష్ట్యా ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ అండ్ రోడ్ ట్రాన్స్‌పోర్ట్ బ్యూరో తో పాటు ఆహార కల్తీని అరికట్టేందుకు ఫుడ్ అడల్ట్రేషన్ కంట్రోల్ ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ సమావేశంలో హోంశాఖ కార్యదర్శి శిఖా గోయల్, ఇంటెలిజెన్స్ డీజీ విజయ్ కుమార్, పోలీస్ అకాడమీ డైరెక్టర్ అభిలాష బిస్త్, లా అండ్ ఆర్డర్ డీజీ మహేష్ భగవత్, టెక్నికల్ సర్వీసెస్ డీజీ వి.వి. శ్రీనివాసరావు, హైదరాబాద్ కమిషనర్ సజ్జనార్, ఆక్టోపస్ డీజీ అనిల్ కుమార్, హోమ్ గార్డ్స్ డీజీ స్వాతి లక్రా, తరుణ్ జోషి ఫ్యూచర్ సిటీ కమిషనర్, సైబరాబాద్ కమిషనర్ ఎం. రమేష్ రెడ్డి, మల్కాజ్గిరి కమిషనర్ సుమతి తదితర సీనియర్ ఐపీఎస్ అధికారులు పాల్గొన్నారు.

Next Story