అనుమతులు లేకుండానే చెట్ల నరికివేత..?

by Ratna Kumari |

గంభీరావుపేటలో అనుమతులు లేకుండానే చెట్ల నరికివేత జరుగుతోందని, అక్రమాలకు అడ్డుకట్ట వేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

అనుమతులు లేకుండానే చెట్ల నరికివేత..?
X

దిశ, గంభీరావుపేట : రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంతో పాటు పలు గ్రామాల్లో అనుమతులు లేకుండానే పెద్ద ఎత్తున చెట్లను నరికివేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ వ్యవహారంలో అటవీశాఖ అధికారులు చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. మండలంలోని పలు ప్రాంతాల్లో కలప వ్యాపారులు రైతులకు డబ్బు చెల్లించి విలువైన చెట్లను నరికించి కట్టెల మిషన్లకు తరలిస్తున్నారని స్థానికులు చెబుతున్నారు. అక్కడి నుంచి గంభీరావుపేట మండలం నుంచి ఇతర ప్రాంతాలకు రోజుకు ఐదు నుంచి ఆరు లోడ్ల కలపను ఎలాంటి అనుమతులు లేకుండానే తరలిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.

జనావాసాల మధ్యలో ఏర్పాటు చేసిన కట్టెల మిషన్ల వల్ల భారీ శబ్దం, కలప పొట్టు ఇళ్లలోకి చేరడంతో చిన్నపిల్లలు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని స్థానికులు వాపోతున్నారు. ఈ విషయంపై గతంలో ఫారెస్ట్ అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపిస్తున్నారు. పర్యావరణ సమతుల్యత, జీవవైవిధ్య పరిరక్షణ కోసం చెట్ల సంరక్షణ అత్యంత అవసరమని పర్యావరణవేత్తలు పేర్కొంటున్నారు. విలువైన నెమలి, వేప, మామిడి వంటి చెట్లను విచక్షణారహితంగా నరికివేయడం వల్ల జీవవైవిధ్యం దెబ్బతింటుందని, వన్యప్రాణులు తమ ఆవాసాలను కోల్పోయి జనావాసాల్లోకి వస్తున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఇదే అంశంపై వార్తలు వచ్చినప్పటికీ పరిస్థితిలో మార్పు రాలేదని, అక్రమ చెట్ల నరికివేతపై సంబంధిత అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

Next Story