- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ బకాయిలు వెంటనే విడుదల చేయాలి
ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని, జీవో ఎంఎస్ నెం. 7, 8, 9లను రద్దు చేయాలని ఏఐఎస్ఎఫ్ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పుట్ట లక్ష్మణ్ డిమాండ్ చేశారు.

దిశ, హనుమకొండ కలెక్టరేట్ : ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని, జీవో ఎంఎస్ నెం. 7, 8, 9లను రద్దు చేయాలని ఏఐఎస్ఎఫ్ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పుట్ట లక్ష్మణ్ డిమాండ్ చేశారు. ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో గురువారం హనుమకొండ ఆర్ట్స్ కాలేజ్ ఆడిటోరియం నుంచి కలెక్టరేట్ వరకు సుమారు **3,000 మంది విద్యార్థులతో భారీ ర్యాలీ** నిర్వహించారు. అనంతరం కలెక్టరేట్ ఎదుట మహాధర్నా చేపట్టగా, సుమారు మూడు గంటల పాటు ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. ఈ సందర్భంగా పుట్ట లక్ష్మణ్ మాట్లాడుతూ.. తెలంగాణలో ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ బకాయిల సమస్య విద్యారంగాన్ని తీవ్ర సంక్షోభంలోకి నెట్టిందన్నారు. గత ప్రభుత్వ హయాం నుంచి పెండింగ్‌లో ఉన్న బకాయిలతో పాటు ప్రస్తుతం మొత్తం **రూ.11 వేల కోట్లకు పైగా** ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ బకాయిలు పేరుకుపోయాయని ఆరోపించారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వద్దే విద్యాశాఖ ఉన్నప్పటికీ విద్యార్థుల సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని విమర్శించారు. పేద విద్యార్థుల పట్ల చిత్తశుద్ధి ఉంటే పెండింగ్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని కోరారు. ఫీజు బకాయిల కారణంగా రాష్ట్రవ్యాప్తంగా ప్రైవేట్ ఇంజినీరింగ్, డిగ్రీ, జూనియర్ కళాశాలలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని, ఇప్పటికే అనేక విద్యాసంస్థలు మూతపడగా మరెన్నో మూతపడే పరిస్థితి ఏర్పడిందని, వేలాది మంది అధ్యాపకులు, ఉద్యోగుల ఉపాధి ప్రమాదంలో పడిందని ఆందోళన వ్యక్తం చేశారు.
జీవోలను రద్దు చేయాలని సంఘీభావం...
.ఈ కార్యక్రమానికి సంఘీభావం ప్రకటించిన డిగ్రీ కళాశాలల అసోసియేషన్ వ్యవస్థాపకులు, మాజీ చైర్మన్ సంగం రెడ్డి సుందర్రాజు యాదవ్ మాట్లాడుతూ.. ప్రభుత్వం అమలు చేస్తున్న జీవో ఎంఎస్ నెం.7, 8లపై విద్యార్థులు, విద్యాసంస్థలు, విద్యార్థి సంఘాలు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయని అన్నారు. విద్యార్థులు, విద్యాసంస్థల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఈ జీవోలను పునఃసమీక్షించి రద్దు చేయడంతో పాటు పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఏఐఎస్ఎఫ్ హనుమకొండ జిల్లా కార్యదర్శి భాషబోయిన సంతోష్ మాట్లాడుతూ, జీవో ఎంఎస్ నెం.7, 8, 9లను వెంటనే రద్దు చేయాలని, విద్యాశాఖకు పూర్తిస్థాయి మంత్రిని నియమించాలని, ప్రభుత్వ విద్యారంగ సమస్యలను అత్యవసరంగా పరిష్కరించాలని కోరారు.
అలాగే రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించాలని, ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేయాలని, ఖాళీగా ఉన్న ఉపాధ్యాయులు, ఎంఈవోలు, డీఈవోలు తదితర పోస్టులను వెంటనే భర్తీ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. విద్యార్థుల సమస్యలను ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తూ ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ బకాయిల విడుదలలో మరింత జాప్యం చేస్తే రాష్ట్రవ్యాప్తంగా ఎమ్మెల్యేలు, మంత్రుల నివాసాల ముట్టడి కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమానికి డిగ్రీ కాలేజ్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు వేణుమాధవ్, బీసీ సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు వడ్లకొండ వేణుగోపాల్ గౌడ్ సంఘీభావం ప్రకటించారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు ఉట్కూరి ప్రణీత్ గౌడ్, జిల్లా ఉపాధ్యక్షులు జక్కుల భానుప్రసాద్, శ్రీపతి వినయ్, కొండ చరణ్, సహాయ కార్యదర్శులు చిర సాయిచంద్, పెండ్యాల బన్నితో పాటు జిల్లా నాయకులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.






