గెలిచే మ్యాచ్‌లో ఓడిన సింధు.. చైనా ఓపెన్‌లో రెండో రౌండ్‌లోనే ఔట్

by Harish |

చైనా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత స్టార్ క్రీడాకారిణి పీవీ సింధుకు షాక్ తగిలింది.

గెలిచే మ్యాచ్‌లో ఓడిన సింధు.. చైనా ఓపెన్‌లో రెండో రౌండ్‌లోనే ఔట్
X

దిశ, స్పోర్ట్స్ : చైనా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత స్టార్ క్రీడాకారిణి పీవీ సింధుకు షాక్ తగిలింది. ఇటవలే జపాన్ ఓపెన్ నెగ్గిన ఆమె భారీ అంచనాలతో బరిలోకి దిగింది. అయితే రెండో రౌండ్‌లో గెలిచే మ్యాచ్‌లో ఓడి ఇంటిదారిపట్టింది. గురువారం జరిగిన మ్యాచ్‌లో చైనాకు చెందిన చెన్ యుఫెయ్ చేతిలో 21-16, 20-22, 18-21 తేడాతో ఓడిపోయింది. గంటా 29 నిమిషాలపాటు సుదీర్ఘంగా సాగిన మ్యాచ్‌లో సింధు విజయం కోసం తీవ్రంగా శ్రమించింది. తొలి గేము నెగ్గి తన ఫామ్‌ను చాటింది.

రెండో గేములోనూ అదే జోరు కొనసాగించి 20-16తేడాతో ఆధిక్యంలో నిలిచింది. విజయానికి ఒక్క పాయింట్ దూరంలో ఉన్న వేళ సింధు తడబడింది. వరుసగా ఐదు పాయింట్స్ కోల్పోయింది. దీంతో రెండో గేము ప్రత్యర్థి గెలిచింది. మూడో గేములో కూడా సింధు చాలా వరకు లీడ్‌లోనే ఉంది. కానీ, చైనా ప్లేయర్ కూడా ఏం తగ్గలేదు. దీంతో మ్యాచ్ ఆసక్తికరంగా మారింది. 17-17తో సమంగా నిలిచిన సమయంలో సింధు‌కు ప్రత్యర్థి కళ్లెం వేసి మ్యాచ్‌ను సొంతం చేసుకుంది. పురుషుల సింగిల్స్‌లో లక్ష్యసేన్, ఆయుశ్ శెట్టి కూడా నిష్ర్కమించారు. రెండో రౌండ్‌లో కెనడా ప్లేయర్ విక్టర్ లై చేతిలో 21-19, 21-11 తేడాతో సేన్ పరాజయం పాలయ్యాడు. రెండో రౌండ్‌లో ఐర్లాండ్ ప్లేయర్ న్హాట్ న్గుయెన్‌తో తలడిన ఆయుశ్ 21-15, 13-21, 20-22 తేడాతో ఓటమి చవిచూశాడు. తొలి గేము నెగ్గినా మిగతా రెండు గేముల్లో పోరాడినా ప్రయోజనం దక్కలేదు.


Next Story