బ్రిక్స్ అంతర్జాతీయ వేదికపై మెరిసిన సర్కారీ బడి విద్యార్థులు

by Naga Rani Yarlagadda |   (  Updated:2026-07-23 14:36:03  IST  )

హైదరాబాద్‌లోని తిరుమలగిరి ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల విద్యార్థులు అంతర్జాతీయ స్థాయిలో తమ ప్రతిభను చాటి తెలంగాణ రాష్ట్రానికి కీర్తి ప్రతిష్టలు తెచ్చిపెట్టారు.

బ్రిక్స్ అంతర్జాతీయ వేదికపై మెరిసిన సర్కారీ బడి విద్యార్థులు
X

దిశ, తెలంగాణ బ్యూరో: హైదరాబాద్‌లోని తిరుమలగిరి ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల విద్యార్థులు అంతర్జాతీయ స్థాయిలో తమ ప్రతిభను చాటి తెలంగాణ రాష్ట్రానికి కీర్తి ప్రతిష్టలు తెచ్చిపెట్టారు. ఐఐటీ తిరుపతిలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన బ్రిక్స్ అంతర్జాతీయ వేదికపై హైదరాబాద్‌లోని చారిత్రక నీటి వనరులు, సరస్సుల వ్యవస్థపై వారు రూపొందించిన విశిష్ట జియోస్పేషియల్ పరిశోధనా పత్రాన్ని విజయవంతంగా సమర్పించారు. కేంద్ర ప్రభుత్వ పరిధిలోని డిపార్ట్‌మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ(డీఎస్టీ) నేషనల్ జియోస్పేషియల్ ప్రోగ్రామ్‌లో భాగంగా, పూణేలోని భారతీ విద్యాపీఠ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎన్విరాన్‌మెంట్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ మార్గదర్శకత్వంలో ఈ ప్రాజెక్టును నిర్వహించారు.

రీకనెక్టింగ్ హైదరాబాద్ చెరువులు

అర్బన్ వాటర్ సెక్యూరిటీ కోసం హైడ్రోలాజికల్ కనెక్టివిటీపై జియోస్పేషియల్ అసెస్మెంట్ అనే అంశంపై తిరుమలగిరి ప్రభుత్వ పాఠశాల టీచర్ మెంటార్ హిరణ్య హంస్రాల పర్యవేక్షణలో 9వ తరగతి విద్యార్థులు మాస్టర్ జోగేష్, మాస్టర్ రిథిక్ ఈ పరిశోధన చేశారు. హైదరాబాద్ నగరాన్ని ఇటీవల కాలంలో ముంచెత్తుతున్న అర్బన్ ఫ్లాష్ ఫ్లడ్స్, నగరంలోని చారిత్రక గొలుసుకట్టు చెరువుల వ్యవస్థను ప్రాతిపదికగా తీసుకుని ఈ ప్రాజెక్టు చేపట్టారు. హైదరాబాద్ పరిసరాల్లోని 30 చారిత్రక నీటి వనరులపై ఆధునిక సాంకేతికత ద్వారా అధ్యయనం చేశారు. ఎపికలెక్ట్5 మొబైల్ యాప్ ద్వారా క్షేత్రస్థాయికి వెళ్లి జిపిఎస్ లొకేషన్లు, ఛాయాచిత్రాలు సేకరించారు. ఆ సమాచారాన్ని గూగుల్ ఎర్త్ ప్రో, 'క్యూజీఐఎస్' సాఫ్ట్‌వేర్‌ల సహాయంతో విశ్లేషించారు. ప్రాజెక్టు అధ్యయనంలో భాగంగా విద్యార్థులు హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (హైడ్రా) కమిషనర్ ఎ. వి. రంగనాథ్ ను కలిసి మార్గదర్శకత్వం పొందారు. హెచ్‌ఎమ్‌డిఏ మ్యాప్‌లు, జియోస్పేషియల్ రికార్డుల ద్వారా చెరువుల అసలు విస్తీర్ణం, దిగువ నీటి ప్రవాహ మార్గాల వివరాలను సేకరించారు.

విశేష ప్రశంసలు - బ్రిక్స్ వేదికపై గౌరవం

హైదరాబాద్ నీటి వ్యవస్థలో సంభవించిన మార్పులు, కుంచించుకుపోయిన చెరువుల విస్తీర్ణం, దెబ్బతిన్న కాలువలు, అలాగే చెరువుల పునరుద్ధరణకు 'హైడ్రా' చేపడుతున్న చర్యలను విద్యార్థులు తమ ప్రజెంటేషన్ ద్వారా స్పష్టంగా వివరించారు. స్థానిక పర్యావరణ సమస్యకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అనుసంధానిస్తూ విద్యార్థులు చేసిన ప్రజెంటేషన్‌ను బ్రిక్స్ దేశాల ప్రతినిధులు, శాస్త్రవేత్తలు, విద్యావేత్తలు విశేషంగా కొనియాడారు. విద్యార్థుల అద్భుత పనితీరుకు గాను ఐఐటీ తిరుపతి డైరెక్టర్ వారిని అప్రిసియేషన్ సర్టిఫికేట్ తో సత్కరించారు.

ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల నైపుణ్యానికి నిదర్శనం: స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ డా. ఇ. నవీన్ నికోలస్

విద్యార్థుల ఈ గొప్ప విజయంపై తెలంగాణ రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్ హర్షం వ్యక్తం చేశారు. విద్యార్థులను, మార్గదర్శక ఉపాధ్యాయురాలిని, ప్రధానోపాధ్యాయుడిని, పాఠశాల బృందాన్ని ఆయన ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సరియైన అవకాశాలు, సరైన మార్గదర్శకత్వం, అనుభవపూర్వక అభ్యాసనం అందిస్తే ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ఎంతటి మహోన్నత శిఖరాలనైనా చేరుకోగలరదనడానికి ఈ విజయమే నిదర్శనం. నిత్య జీవితంలో ఎదురయ్యే సవాళ్లను తరగతి గది అభ్యాసంతో అనుసంధానించేలా ప్రాజెక్ట్ లెర్నింగ్, శాస్త్రీయ దృక్పథం, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని పాఠశాలల్లో ప్రోత్సహించాలి. అంతర్జాతీయ స్థాయిలో మన సర్కారీ బడి విద్యార్థులు సాధించిన ఈ గుర్తింపు తెలంగాణ విద్యాశాఖకు ఎంతో గర్వకారణం." అని పేర్కొన్నారు.

Next Story