2036 నాటికి టాప్-10 క్రీడా దేశంగా భారత్.. కేంద్ర మంత్రి బండి సంజయ్

by Ramesh Naini |

2036 నాటికి ప్రపంచంలోని టాప్-10 క్రీడా దేశాల జాబితాలో, 2047 నాటికి టాప్-5 క్రీడా దేశాల సరసన భారత్ నిలిచేలా కేంద్ర ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా పనిచేస్తోందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు.

2036 నాటికి టాప్-10 క్రీడా దేశంగా భారత్.. కేంద్ర మంత్రి బండి సంజయ్
X

దిశ, తెలంగాణ బ్యూరో: 2036 నాటికి ప్రపంచంలోని టాప్-10 క్రీడా దేశాల జాబితాలో, 2047 నాటికి టాప్-5 క్రీడా దేశాల సరసన భారత్ నిలిచేలా కేంద్ర ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా పనిచేస్తోందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. సీఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో గచ్చిబౌలిలోని బాలయోగి ఇండోర్ స్టేడియంలో నిర్వహిస్తున్న 11వ ఆలిండియా పోలీస్ జూడో క్లస్టర్–2026 క్రీడా పోటీలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ, 2030 కామన్వెల్త్ క్రీడలకు ఆతిథ్యం ఇవ్వడానికి భారత్ సిద్ధమవుతోందన్నారు. క్రీడా రంగ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని, 2026–27 కేంద్ర బడ్జెట్‌లో క్రీడలకు రూ.4,480 కోట్ల కేటాయింపు చేసి, దేశీయ క్రీడా పరికరాల తయారీ, పరిశోధనల కోసం అదనంగా రూ.500 కోట్ల ప్రత్యేక నిధిని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ‘ఖేలో ఇండియా’ కార్యక్రమం ద్వారా దేశవ్యాప్తంగా 1,000కుపైగా శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేసి, వేలాది మంది యువ క్రీడాకారులను ప్రోత్సహిస్తున్నామని చెప్పారు. పోలీసు, భద్రతా దళాల సిబ్బందిలో శారీరక దృఢత్వం, క్రమశిక్షణ, మానసిక స్థైర్యాన్ని పెంపొందించడంలో జూడో, కరాటే, తైక్వాండో, వుషు వంటి మార్షల్ ఆర్ట్స్ కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు.

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా దేశవ్యాప్తంగా 36 జట్లకు చెందిన సుమారు 1,600 మంది క్రీడాకారులు ఈ జూడో క్లస్టర్ పోటీల్లో పాల్గొంటున్నారు. జాతీయ స్థాయి పోటీల నిర్వహణలో సీఐఎస్ఎఫ్ చేసిన ఏర్పాట్లను బండి సంజయ్ అభినందించారు. ఈ పోటీలు పోలీసు దళాల మధ్య స్నేహభావం, జాతీయ సమైక్యతను బలోపేతం చేయడంతో పాటు అంతర్జాతీయ స్థాయి క్రీడలకు ప్రతిభావంతులను తీర్చిదిద్దేందుకు దోహదపడతాయని ఆయన అన్నారు.

Next Story