కారుపై పడ్డ కొమ్మలు తీస్తుండగా కరెంట్ షాక్.. తండ్రి, కూతురు మృతి.. తల్లి పరిస్థితి విషమం

by Jakkula.Mamatha |

అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని టెలికాం కాలనీలో శనివారం విషాద ఘటన చోటుచేసుకుంది.

కారుపై పడ్డ కొమ్మలు తీస్తుండగా కరెంట్ షాక్.. తండ్రి, కూతురు మృతి.. తల్లి పరిస్థితి విషమం
X

దిశ,మేడ్చల్ బ్యూరో: అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని టెలికాం కాలనీలో శనివారం విషాద ఘటన చోటుచేసుకుంది. శుక్రవారం రాత్రి కురిసిన భారీ వర్షాలకు ఇంటి ముందు పార్క్ చేసిన కారుపై చెట్టు కొమ్మలు విరిగి పడ్డాయి. వాటిని తొలగించే క్రమంలో విద్యుత్ షాక్ తగిలి తండ్రి సందీప్(44), కూతురు రితిక(16) మృతి చెందారు. స్థానికుల వివరాల ప్రకారం.. కారుపై పడిన చెట్టు కొమ్మలను తొలగిస్తుండగా వాటికి సమీపంలోని విద్యుత్ తీగలు తగిలి ఉండటంతో ఒక్కసారిగా కరెంట్ ప్రవహించింది. ఈ ప్రమాదంలో రితిక విద్యుత్ షాక్‌కు గురికాగా, ఆమెను రక్షించే ప్రయత్నంలో తండ్రి సందీప్‌కు కూడా విద్యుత్ షాక్ తగిలింది.

దీంతో ఇద్దరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. అదే సమయంలో సహాయం చేసేందుకు వెళ్లిన సందీప్ భార్య శ్వేత(40)కు కూడా విద్యుత్ షాక్ తగలడంతో తీవ్రంగా గాయపడింది. ఆమెను కుటుంబ సభ్యులు, స్థానికులు వెంటనే సమీప ఆసుపత్రికి తరలించగా, పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. సమాచారం అందుకున్న అల్వాల్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Next Story