ఘోర ప్రమాదం.. బస్సు బీభత్సానికి సిఆర్‌పిఎఫ్ జవాన్ సహా నలుగురు మృతి

by Malleboina Mahesh |

వేగంగా వెళ్తున్న బస్సు అదుపుతప్పి మరో వాహనాన్ని ఢీ కొట్టడంతో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. బస్సు బీభత్సానికి సిఆర్‌పిఎఫ్ జవాన్ సహా నలుగురు మృతి చెందారు.

ఘోర ప్రమాదం.. బస్సు బీభత్సానికి సిఆర్‌పిఎఫ్ జవాన్ సహా నలుగురు మృతి
X

దిశ, వెబ్ డెస్క్: వేగంగా వెళ్తున్న బస్సు అదుపుతప్పి మరో వాహనాన్ని ఢీ కొట్టడంతో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. బస్సు బీభత్సానికి సిఆర్‌పిఎఫ్ జవాన్ సహా నలుగురు మృతి చెందారు. ఈ షాకింగ్ ఘటన జమ్మూ కాశ్మీర్‌లోని ఉధంపూర్ జిల్లాలో మంగళవారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. జమ్మూ-శ్రీనగర్ జాతీయ రహదారిపై జఖానీ-చెనాని ప్రాంతంలో ఉదయం 11 గంటల సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. డోడా నుండి జమ్మూ వైపు వెళ్తున్న ఒక ప్రైవేటు బస్సు డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో ఈ ఘోరం జరిగినట్లు అధికారులు తెలిపారు.

అదుపు తప్పిన బస్సు తొలుత ఒక మోటార్ సైకిల్‌ను ఢీకొట్టి, ఆపై రహదారి పక్కనే ఆగి ఉన్న లోడ్ క్యారియర్‌ను బలంగా ఢీకొట్టింది. ప్రమాదం జరిగిన సమయంలో ఆ లోడ్ క్యారియర్‌కు స్వల్ప సాంకేతిక లోపం తలెత్తడంతో ఒక మెకానిక్ దానిని రిపేర్ చేస్తున్నాడు. ఈ క్రమంలో బస్సు వేగంగా వచ్చి ఢీకొట్టడంతో బైక్ పైన ఉన్న జవాన్, లోడ్ క్యారియర్ డ్రైవర్, మెకానిక్ సహా నలుగురు అక్కడికక్కడే మరణించారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా నిర్ధారించారు.

Next Story