రాజస్థాన్‌లో ఘోర ప్రమాదం.. బస్సు-ట్రైలర్ ఢీకొని ఆరుగురు మృతి

by Malleboina Mahesh |

జోధ్‌పూర్-బలోత్రా రహదారిపై బస్సు, ట్రైలర్ ఢీకొన్న ప్రమాదంలో ఆరుగురు మరణించారు. పలువురు క్షతగాత్రులు MDM ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

రాజస్థాన్‌లో ఘోర ప్రమాదం.. బస్సు-ట్రైలర్ ఢీకొని ఆరుగురు మృతి
X

దిశ, వెబ్ డెస్క్: ప్రయాణికులతో వెళ్తున్న బస్సు ట్రైలర్ ను ఢీకొనడంతో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘోర రోడ్డు ప్రమాదం (Serious road accident) రాజస్థాన్‌లోని బలోత్రా జిల్లా కళ్యాణ్‌పుర పోలీస్ స్టేషన్ పరిధిలో ఈరోజు జరిగింది. వివరాల్లోకి వెళితే.. జోధ్‌పూర్ నుండి బలోత్రా వైపు వెళ్తున్న ఒక ప్రైవేట్ స్లీపర్ బస్సు, ఎదురుగా వస్తున్న ట్రైలర్‌ను ఓవర్‌టేక్ చేసే క్రమంలో బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సు కుడి వైపు భాగం పూర్తిగా ధ్వంసమైంది. మృతుల్లో ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నట్లు సమాచారం. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు, పోలీసులు సహాయక చర్యలు చేపట్టి క్షతగాత్రులను బస్సు కిటికీల గుండా బయటకు తీశారు.

ప్రమాద తీవ్రత దృష్ట్యా క్షతగాత్రులను బలోత్రా, జోధ్‌పూర్‌లోని ఆసుపత్రులకు తరలించారు. ఏసీపీ ఛవి శర్మ (ACP Chhavi Sharma) తెలిపిన వివరాల ప్రకారం.. సుమారు ఎనిమిది మంది బాధితులను జోధ్‌పూర్‌లోని మధుర దాస్ మాథుర్ (MDM) ఆసుపత్రికి తరలించి అత్యవసర చికిత్స అందిస్తున్నారు. మరికొందరు స్థానిక బలోత్రా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనతో జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించగా, మితిమీరిన వేగమే ఈ ప్రమాదానికి ప్రధాన కారణమని ప్రాథమికంగా భావిస్తున్నారు.

Next Story