ఘోర ప్రమాదం..బస్సు-ట్రక్కు ఢీకొని ఆరుగురు మృతి

by Malleboina Mahesh |   (  Updated:2026-04-13 02:56:40  IST  )

ఉత్తర ప్రదేశ్‌లోని హాపుర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం! బస్సు-ట్రక్కు ఢీకొని ఆరుగురు దుర్మరణం. పలువురికి తీవ్ర గాయాలు.

ఘోర ప్రమాదం..బస్సు-ట్రక్కు ఢీకొని ఆరుగురు మృతి
X

దిశ, వెబ్ డెస్క్: ప్రయాణికులతో వెళ్తున్న ఓ ప్రైవేటు బస్సు ట్రక్కును ఢీకొట్టింది. దీంతో ఆరుగురు ప్రాణాలు కోల్పోగా.. 15 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ షాకింగ్ ఘటన ఉత్తర ప్రదేశ్‌లోని హాపుర్ జిల్లా ధౌలానా-గులవతి మార్గంలో సోమవారం ఉదయం సంభవించింది. ఈ ప్రమాద ధాటికి బస్సు ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జయింది. ఈ దుర్ఘటనలో ఆరుగురు ప్రయాణికులు అక్కడికక్కడే మరణించగా, మరో 10 నుంచి 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. కాగా ఈ ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే స్థానిక పోలీసులు, సహాయక బృందాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి.

గ్యాస్ కట్టర్ల సాయంతో బస్సు శిథిలాల నుంచి మృతదేహాలను, క్షతగాత్రులను బయటకు తీశారు. గాయపడిన వారిని వెంటనే చికిత్స నిమిత్తం సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రులలో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. దట్టమైన పొగమంచు, అతివేగమే ఈ ప్రమాదానికి కారణమై ఉండవచ్చని ప్రాథమికంగా భావిస్తున్నారు. పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. మృతుల కుటుంబ సభ్యులకు సమాచారం అందించే ప్రక్రియ కొనసాగుతోంది. ఈ ప్రమాదానికి సంబంధించిన విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా, మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.

Next Story