మెదక్ జిల్లాలో 86 శాతం SIR పూర్తి : కలెక్టర్ ప్రతిమా సింగ్

by Batti.Sumithra |

2002 ఓటరు జాబితా నుంచి ఇప్పటివరకు గుర్తింపు కాని ఓటర్ల వివరాలను క్షేత్రస్థాయిలో సేకరించి, వారిని తప్పనిసరిగా గుర్తింపు ప్రక్రియలోకి తీసుకురావడానికి ప్రత్యేక చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ అధికారులను ఆదేశించారు.

మెదక్ జిల్లాలో 86 శాతం SIR పూర్తి : కలెక్టర్ ప్రతిమా సింగ్
X

దిశ, నర్సాపూర్ : 2002 ఓటరు జాబితా నుంచి ఇప్పటివరకు గుర్తింపు కాని ఓటర్ల వివరాలను క్షేత్రస్థాయిలో సేకరించి, వారిని తప్పనిసరిగా గుర్తింపు ప్రక్రియలోకి తీసుకురావడానికి ప్రత్యేక చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ అధికారులను ఆదేశించారు. ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమంలో భాగంగా గురువారం నర్సాపూర్ ఆర్డీవో కార్యాలయంలో తహసీల్దార్లు, బీఎల్‌వోలు, సూపర్‌వైజర్లతో జరిగిన సమావేశంలో జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ మాట్లాడుతూ, మెదక్ జిల్లాలో 86 శాతం SIR పూర్తయిందన్నారు. మరణించిన, డబుల్ నమోదైన, శాశ్వతంగా ఇతర ప్రాంతాలకు మారిన, గైర్హాజరుగా ఉన్న ఓటర్ల వివరాలను విడివిడిగా జాబితాలుగా సిద్ధం చేయాలని బీఎల్‌వోలను ఆదేశించారు.

అలాగే ఇప్పటికే గుర్తింపు చేసిన ఓటర్ల వివరాల్లో ఉన్న వ్యత్యాసాలు, లోపాలను తగ్గించేలా క్షుణ్ణంగా పరిశీలించి సరిదిద్దాలని సూచించారు. చనిపోయిన ఓటర్లు, శాశ్వతంగా ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన ఓటర్లు, డబుల్ నమోదైన ఓటర్ల పేర్లను తొలగించే ముందు క్షేత్రస్థాయిలో పూర్తిస్థాయిలో ధృవీకరణ చేపట్టాలని, అనంతరం గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల బూత్ లెవల్ ఏజెంట్ల సంతకాలు తీసుకున్న తర్వాత మాత్రమే సంబంధిత ప్రక్రియను పూర్తి చేయాలని సూచించారు. ప్రత్యేక ఓటరు జాబితా సవరణ ప్రక్రియను పూర్తిస్థాయి పారదర్శకతతో నిర్వహించాలని బీఎల్‌వోలకు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో నర్సాపూర్ ఆర్డీవో రామకృష్ణ, తహసీల్దార్ శ్రీనివాస్, బీఎల్‌వోలు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Next Story