ఎర్రచందనం మాఫియాపై పవన్ కీలక ఆదేశాలు

by Vemula.Srinu Prasad |   (  Updated:2026-07-23 15:19:05  IST  )

రాష్ట్రంలో ఎర్రచందనం అక్రమ రవాణాను పూర్తిగా నిర్మూలించే లక్ష్యంతో అటవీ శాఖ కార్యాచరణకు మరింత పదును పెట్టాలని ఉప ముఖ్యమంత్రి, అటవీ పర్యావరణ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశించారు..

ఎర్రచందనం మాఫియాపై పవన్ కీలక ఆదేశాలు
X

దిశ, ఏపీ బ్యూరో: రాష్ట్రంలో ఎర్రచందనం అక్రమ రవాణాను పూర్తిగా నిర్మూలించే లక్ష్యంతో అటవీ శాఖ కార్యాచరణకు మరింత పదును పెట్టాలని ఉప ముఖ్యమంత్రి, అటవీ పర్యావరణ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశించారు. డ్రోన్ పరిజ్ఞానం, అత్యాధునిక సాంకేతికతను వినియోగిస్తూ నిఘా వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని, స్మగ్లింగ్ అరికట్టడంలో జీరో టాలరెన్స్ విధానాన్ని కఠినంగా అమలు చేయాలని స్పష్టం చేశారు. గురువారం క్యాంపు కార్యాలయంలో ఎర్రచందనం అక్రమ రవాణా నిరోధంపై అటవీ శాఖ ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. గత రెండేళ్లలో ఎర్రచందనం స్మగ్లింగ్ నియంత్రణకు చేపట్టిన చర్యలు, నమోదైన కేసులు, భవిష్యత్ కార్యాచరణపై అధికారులతో సమీక్షించారు.

రెండేళ్లలో 506 కేసులు.. 1,239 మంది అరెస్ట్

ఎర్రచందనం అక్రమ రవాణాపై గత రెండేళ్లలో 506 కేసులు నమోదు చేసి, 1,239 మందిని అరెస్ట్ చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఈ సందర్భంగా 372 వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. అలాగే, 12 మంది ప్రధాన స్మగ్లర్లపై పీడీ చట్టం కింద చర్యలు తీసుకున్నట్లు వివరించారు. గుజరాత్, ఢిల్లీ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో అక్రమంగా నిల్వ చేసిన 35.6 మెట్రిక్ టన్నుల ఎర్రచందనాన్ని ఆయా రాష్ట్రాల పోలీసు, అటవీ శాఖల సమన్వయంతో నిర్వహించిన ప్రత్యేక ఆపరేషన్ల ద్వారా స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో ఇటువంటి అంతర్రాష్ట్ర ప్రత్యేక ఆపరేషన్లు చేపట్టలేదని పేర్కొన్నారు.

95 శాతానికి పెరిగిన కన్విక్షన్ రేటు

ఎర్రచందనం అక్రమ రవాణా కేసుల్లో గతంలో కన్విక్షన్ రేటు 3 శాతం కంటే తక్కువగా ఉండేదని, ప్రస్తుతం 95 శాతం కేసుల్లో నిందితులకు కోర్టులు శిక్షలు విధించే స్థాయికి కన్విక్షన్ రేటు పెరిగిందని అధికారులు వివరించారు. గతంలో స్మగ్లర్లపై పీడీ చట్టం అమలు చేయని పరిస్థితి ఉండగా, కూటమి ప్రభుత్వం ఏర్పడిన రెండేళ్లలోనే 12 మంది ప్రధాన స్మగ్లర్లపై పీడీ చట్టం కింద చర్యలు తీసుకున్నట్లు తెలిపారు.

కింగ్‌పిన్‌లు, ఫైనాన్షియర్లపై ఉక్కుపాదం

సమావేశంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్‌కు మాత్రమే ప్రత్యేకమైన అటవీ సంపద ఎర్రచందనాన్ని కాపాడుకోవడం అందరి బాధ్యత అని అన్నారు. రాష్ట్రంలో జీరో టాలరెన్స్ విధానాన్ని క్షేత్రస్థాయిలో మరింత పటిష్టంగా అమలు చేయాలని సూచించారు. దేశంలో ఎక్కడ ఎర్రచందనం అక్రమ నిల్వలు ఉన్నా ఆయా రాష్ట్రాల అధికారులతో సమన్వయం చేసుకుని స్వాధీనం చేసుకోవాలని, ఇతర రాష్ట్రాల పోలీసు, అటవీ శాఖలతో సమన్వయాన్ని మరింత బలోపేతం చేయాలని ఆదేశించారు. స్మగ్లింగ్ ముఠాల వెనుక ఉన్న కింగ్‌పిన్‌లు, ఫైనాన్షియర్లు, నిర్వాహకులపై కూడా కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. అత్యాధునిక సాంకేతికత, డ్రోన్ వ్యవస్థలను విస్తృతంగా వినియోగించి నిఘాను మరింత పటిష్టం చేయాలని, అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి ఎర్రచందనం అక్రమ రవాణాను పూర్తిగా అరికట్టాలని పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు.

Next Story