దిశ ఎఫెక్ట్.. ఏజెన్సీ పాఠశాలల ఉపాధ్యాయుల డిప్యూటేషన్లు రద్దు

by Ratna Kumari |

నాగర్‌కర్నూల్ జిల్లా ఏజెన్సీ ప్రాంత ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరతపై దిశలో ప్రచురితమైన వరుస కథనాలకు స్పందించిన జిల్లా యంత్రాంగం కీలక నిర్ణయం తీసుకుంది.

దిశ ఎఫెక్ట్.. ఏజెన్సీ పాఠశాలల ఉపాధ్యాయుల డిప్యూటేషన్లు రద్దు
X

దిశ, అచ్చంపేట : నాగర్‌కర్నూల్ జిల్లా ఏజెన్సీ ప్రాంత ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరతపై దిశలో ప్రచురితమైన వరుస కథనాలకు స్పందించిన జిల్లా యంత్రాంగం కీలక నిర్ణయం తీసుకుంది. ఏజెన్సీ ప్రాంతాల నుంచి మైదాన ప్రాంతాలకు డిప్యూటేషన్‌పై వెళ్లిన ఉపాధ్యాయుల డిప్యూటేషన్లను తక్షణ ప్రభావంతో రద్దు చేస్తూ జిల్లా విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఏజెన్సీ పాఠశాలలను స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ సందర్శించి డిప్యూటేషన్లను రద్దు చేయాలని అధికారులను ఆదేశించగా, జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ ఆదేశాల మేరకు డీఈఓ రమేష్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.

జూలై 24 నుంచే విధుల్లో చేరాలి..

డిప్యూటేషన్‌పై మైదాన ప్రాంతాల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులందరూ జూలై 24 నుంచి తమ అసలు నియామక పాఠశాలలైన ఏజెన్సీ ప్రాంత ప్రభుత్వ పాఠశాలల్లో తప్పనిసరిగా విధుల్లో చేరాలని డీఈఓ ఆదేశించారు. ఈ ఉత్తర్వుల అమలును ప్రధానోపాధ్యాయులు, మండల విద్యాశాఖ అధికారులు పర్యవేక్షించాలని సూచించారు.

హాజరు కాకుంటే శాఖాపరమైన చర్యలు..

ప్రభుత్వ ఆదేశాలను పాటించకుండా విధులకు హాజరుకాని ఉపాధ్యాయులపై ప్రభుత్వ నిబంధనల ప్రకారం శాఖాపరమైన క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని డీఈఓ రమేష్ కుమార్ హెచ్చరించారు. ఎలాంటి మినహాయింపులు ఉండవని స్పష్టం చేశారు. ఏజెన్సీ ప్రాంత విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడమే ప్రభుత్వ లక్ష్యమని, విద్యా బోధనకు ఎలాంటి అంతరాయం కలగకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

హర్షం వ్యక్తం చేసిన ప్రజలు..

ఏజెన్సీ ప్రాంతాల్లో విద్యా వ్యవస్థపై దిశ ప్రచురించిన వరుస కథనాలు, అనంతరం ఎమ్మెల్యే వంశీకృష్ణ పాఠశాలల సందర్శన, జిల్లా యంత్రాంగం తీసుకున్న చర్యలపై స్థానిక విద్యావంతులు, తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిటీ కన్వీనర్ బియ్యని వెంకటేష్ మాట్లాడుతూ.. ఏజెన్సీ విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం డిప్యూటేషన్లను రద్దు చేయడం స్వాగతించదగ్గ నిర్ణయమని పేర్కొన్నారు.

Next Story