మెడికేషన్ ఎర్రర్స్ కు చెక్.. వన్ బ్రాండ్- వన్ ఫార్ములేషన్

by Naga Rani Yarlagadda |   (  Updated:2026-07-23 15:19:40  IST  )

ఔషధ భద్రత రంగంలో కేంద్ర ప్రభుత్వ పరిధిలోని సీడీఎస్సీఓ ప్రతిపాదించిన ‘ఒకే బ్రాండ్– ఒకే ఫార్ములేషన్’ విధానంపై వైద్య వర్గాల నుంచి హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.

మెడికేషన్ ఎర్రర్స్ కు చెక్.. వన్ బ్రాండ్- వన్ ఫార్ములేషన్
X
  • ఔషధ భద్రతలో విప్లవాత్మక మార్పుకు సీడీఎస్సీఓ శ్రీకారం
  • నూతన విధానాన్ని స్వాగతిస్తున్న వైద్యులు

దిశ, తెలంగాణ బ్యూరో: ఔషధ భద్రత రంగంలో కేంద్ర ప్రభుత్వ పరిధిలోని సీడీఎస్సీఓ (సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్) ప్రతిపాదించిన ‘ఒకే బ్రాండ్– ఒకే ఫార్ములేషన్’ విధానంపై వైద్య వర్గాల నుంచి హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఒకే బ్రాండ్ పేరుతో వేర్వేరు మందులను విక్రయించే పద్ధతిని (సేమ్ బ్రాండ్- డిఫెరెంట్ డ్రగ్) నిషేధించాలని సీడీఎస్సీఓ యోచిస్తుండటం రోగుల ప్రాణ రక్షణకు అత్యంత కీలకమైన అడుగుగా వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మందుల పేర్ల కలగాపులగంతో తలెత్తే మందుల పొరపాట్లను (మెడికేషన్ ఎర్రర్స్) తగ్గించడానికి కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తీసుకుంటున్న ఈ నిర్ణయాన్ని వైద్యులు అభినందిస్తున్నారు.

ఒకే పేరు వేర్వేరు మందులు- ప్రాణాలకే ప్రమాదం..

ఫార్మా కంపెనీలు తమ ప్రాచుర్యం పొందిన బ్రాండ్ పేరుతోనే, వేర్వేరు కాంబినేషన్లు లేదా మందులను మార్కెట్లో విడుదల చేయడం ప్రస్తుతం సాధారణమైపోయింది. ఇది రోగులకు, ముఖ్యంగా పిల్లల వైద్యంలో (పీడియాట్రిక్స్) తీవ్ర అయోమయాన్ని, ప్రాణాపాయాన్ని కలిగిస్తోంది. విభిన్న వ్యాధులకు వాడే మందులకు ఒకే బ్రాండ్ పేరును ఉపయోగించడం వల్ల, షాపుల్లో ఇచ్చేటప్పుడు లేదా ఇంట్లో వాడేటప్పుడు ఒకదానికి బదులు మరొకటి వాడే ప్రమాదం ఉంది. ఉదాహరణకు సాధారణ జలుబు, అలర్జీకి వాడే సినరెస్ట్, సినరెస్ట్ ఏఫ్... దగ్గు మందులైన అంబ్రోడిల్, అంబ్రోడిల్ ప్లస్, అంబ్రోడిల్ ఎస్, అంబ్రోడిల్ ఎల్ఎస్ వంటి పేర్ల మధ్య వ్యత్యాసాన్ని సాధారణ పౌరులు లేదా ఫార్మసిస్టులు సైతం సరిగ్గా గుర్తించలేకపోతున్నారు. అంతేకాకుండా, ఒకే మందు అయినప్పటికీ మోతాదులో (డోసేజ్) తేడా ఉండే ఉత్పత్తులకు వేర్వేరు పేర్లు లేదా స్పష్టమైన గుర్తింపు లేకపోవడం అత్యంత ప్రమాదకరంగా మారింది. మెక్స్ ట్రా డ్రాప్స్ వర్సెస్ మెక్స్ ట్రా సిరప్, అలాగే డోమ్ స్టాల్ డ్రాప్స్ వర్సెస్ డోమ్ స్టాల్ సిరప్ వంటి వాటిలో సిరప్‌లు, డ్రాప్స్ మధ్య మోతాదు వ్యత్యాసాలను గుర్తించకపోతే పిల్లల్లో ఓవర్ డోస్ కావడం వల్ల కాలేయం, మూత్రపిండాలు దెబ్బతిని ప్రాణాలకే ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని ప్రముఖ పీడియాట్రీషియన్ డా. శివరంజని సంతోష్ హెచ్చరించారు.

రోగులకు చేకూరే ప్రయోజనాలు– ఫార్మా కంపెనీల బ్రాండ్ దందాకు చెక్..

ఈ కొత్త విధానం అమల్లోకి వస్తే ప్రధానంగా పెద్ద ఫార్మా కంపెనీలు చేసే బ్రాండ్ విస్తరణ దందాకు చెక్ పడనుంది. మార్కెట్లో ఒక బ్రాండ్ పేరు పాపులర్ అవ్వగానే, అదే పేరుతో సరైన క్లినికల్ ట్రయల్స్ లేదా స్పష్టత లేకుండా కొత్త కాంబినేషన్లను మార్కెట్లోకి తెచ్చి అధిక ధరలకు విక్రయించే పద్ధతికి తెరపడుతుంది. మెడికల్ షాపుల్లో ఇచ్చే పొరపాట్లు (డిస్పెన్సింగ్ ఎర్రర్స్) తగ్గడం వల్ల రోగులకు సరైన మందు సరిపడే మోతాదులోనే అందుతుంది. బ్రాండ్ పేర్ల అయోమయం తగ్గితే, రోగులు, వైద్యులు మందులోని అసలు జెనరిక్/కెమికల్ నేమ్ గుర్తించడం సులువవుతుంది. ఇది తక్కువ ధరకే లభించే జనరిక్ ఔషధాల వినియోగాన్ని పెంచి, పేద, మధ్యతరగతి ప్రజలపై వైద్య భార భారాన్ని గణనీయంగా తగ్గిస్తుంది. అలాగే ఏ రోగి ఏ వ్యాధికి ఏ మందు వాడుతున్నారో స్పష్టత ఏర్పడుతుంది.

వన్ బ్రాండ్- వన్ ఫార్ములేషన్ సమర్ధంగా అమలు చేయాలంటే..

ఒక బ్రాండ్ పేరును ఒకే ఒక్క ఫార్ములేషన్‌కు మాత్రమే కేటాయించాలని, బ్రాండ్ విస్తరణ పేరుతో వేరే ఇతర కెమికల్ కాంబినేషన్‌కు ఆ పేరు ఇవ్వకూడదని డా. శివరంజని సూచించారు. డ్రాప్స్, సిరప్‌ల మధ్య డోసేజ్ వ్యత్యాసాలు సులభంగా అర్థమయ్యేలా బాటిళ్లపై స్పష్టమైన విజువల్ గుర్తులు, బ్రాండింగ్ ఉండాలన్నారు. ఈ నిబంధనలను వీలైనంత త్వరగా అమల్లోకి తెస్తే వేలాది మంది పిల్లల, రోగుల ప్రాణాలను కాపాడవచ్చని ఆమె పేర్కొన్నారు. రోగుల భద్రతే లక్ష్యంగా సీడీఎస్సీఓ ప్రతిపాదించిన ఈ చారిత్రాత్మక విధానం అమల్లోకి వస్తే, దేశంలో ఫార్మాసిస్టులు, వైద్యులు, రోగులలో తలెత్తే అయోమయానికి తెరపడటమే కాకుండా, అపొరపాట్ల వల్ల జరిగే ప్రమాదాలు గణనీయంగా తగ్గించేందుకు అవకాశం ఉంది.

Next Story