ఘోర ప్రమాదం: క్రేన్‌ను ఢీకొట్టిన కారు.. ముగ్గురు దుర్మరణం!

by Malleboina Mahesh |

బెతుల్ జిల్లాలో ఘోర ప్రమాదం! నిలిపి ఉంచిన క్రేన్‌ను ఢీకొట్టిన కారు; ముగ్గురు మృతి, ఇద్దరికి గాయాలు. అతివేగమే కారణమని పోలీసుల వెల్లడి

ఘోర ప్రమాదం: క్రేన్‌ను ఢీకొట్టిన కారు.. ముగ్గురు దుర్మరణం!
X

దిశ, వెబ్ డెస్క్: వేగంగా వెళ్తున్న కారు క్రేన్ ను ఢీకొట్టడంతో భారీ ప్రమాదం చోటు చేసుకొని ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ఈ షాకింగ్ ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని బెతుల్ జిల్లాలో మంగళవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. ఇటార్సీ రోడ్డుపై వేగంగా వెళ్తున్న ఒక కారు, రోడ్డు పక్కన నిలిపి ఉంచిన క్రేన్‌ను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద ధాటికి కారు పూర్తిగా నుజ్జునుజ్జు అయ్యింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.

వివరాల్లోకి వెళితే.. తెల్లవారుజామున సుమారు 2:30 నుంచి 3:00 గంటల మధ్య ఈ ప్రమాదం జరిగింది. బాధితులంతా సమీపంలోని ఒక దాబాలో రాత్రి భోజనం ముగించుకుని తిరిగి వస్తుండగా ఈ విషాదం చోటుచేసుకుంది. కారు అతివేగంగా ఉండటం వల్లే నియంత్రణ కోల్పోయి క్రేన్‌ను ఢీకొట్టినట్లు పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. కారు ఎంతటి వేగంతో ఢీకొట్టిందంటే.. లోపల ఉన్న వారు బయటకు రాలేనంతగా వాహనం నలిగిపోయింది. పోలీసులు, స్థానికులు కారు తలుపులు, కిటికీలు పగలగొట్టి లోపల చిక్కుకున్న వారిని బయటకు తీయాల్సి వచ్చింది.

కోత్వాలి పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ (SHO) దేవకరణ్ దెహ్రియా తెలిపిన వివరాల ప్రకారం.. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన ఇద్దరిని చికిత్స కోసం జిల్లా ఆసుపత్రికి తరలించగా, వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. రాత్రి వేళల్లో మరియు తెల్లవారుజామున వాహనాలు నడిపేవారు అప్రమత్తంగా ఉండాలని, అతివేగం ప్రాణాలకు ముప్పు కలిగిస్తుందని పోలీసులు హెచ్చరించారు.

Next Story