ఆరుతడి పంటల సాగుపై రైతులు దృష్టి పెట్టాలి

by Ratna Kumari |

వర్షాభావ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని రైతులు అధిక నీటి అవసరం ఉన్న పంటలకు బదులుగా ఆరుతడి పంటల సాగుపై దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ బి.చంద్రశేఖర్ సూచించారు.

ఆరుతడి పంటల సాగుపై రైతులు దృష్టి పెట్టాలి
X

దిశ, నల్గొండ టౌన్ : వర్షాభావ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని రైతులు అధిక నీటి అవసరం ఉన్న పంటలకు బదులుగా ఆరుతడి పంటల సాగుపై దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ బి.చంద్రశేఖర్ సూచించారు. మంగళవారం నల్గొండ మండలం దోమలపల్లి రైతు వేదికలో నిర్వహించిన రైతు నేస్తం–100వ ఎపిసోడ్ కార్యక్రమంలో ఆయన పాల్గొని రైతులను ఉద్దేశించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హైదరాబాద్ నుంచి వర్చువల్‌గా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. సెప్టెంబర్ నెలలో కూడా ఆశించిన స్థాయిలో వర్షాలు కురిసే అవకాశాలు కనిపించడం లేదని, శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టులకు తగినంత నీరు వచ్చే పరిస్థితులు లేవని తెలిపారు.

ఇప్పటికే పత్తి, కంది సాగు చేసిన రైతులు అంతర పంటలు వేసుకోవాలని, సజ్జలు, సామలు, కొర్రలు వంటి ఆరుతడి పంటల సాగుకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. ఉద్యాన పంటల సాగు చేపట్టే రైతులకు ప్రభుత్వం సబ్సిడీపై బిందు సేద్య పరికరాలు అందిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ ఎల్‌నినో ప్రభావం దృష్ట్యా రైతులు నీటి లభ్యతను దృష్టిలో ఉంచుకుని ఆరుతడి, ఉద్యాన పంటల సాగుకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. ఆధునిక సాగు పద్ధతులు అవలంబించి పంటల మార్పిడి ద్వారా నష్టాలను తగ్గించుకోవాలని రైతులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి వినోద్ కుమార్, హార్టికల్చర్ డిప్యూటీ డైరెక్టర్ శేఖర్, వ్యవసాయ శాఖ అధికారులు, రైతులు పాల్గొన్నారు.

Next Story