- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రైతులు ఆరుతడి పంటలే సాగు చేయాలి : ఎమ్మెల్యే సునీతారెడ్డి
ఎల్‌నినో ప్రభావంతో ప్రస్తుత వర్షాభావ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని అధిక నీటితో సాగు చేసే వరి పంటకు బదులుగా తక్కువ నీటితో సాగు చేసే ప్రత్యామ్నాయ పంటలైన జొన్నలు, కందులు, పెసర, సజ్జలు, కొర్రలు, కూరగాయ పంటలను సాగు చేసి అధిక ఆదాయం పొందాలని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతారెడ్డి రైతులకు పిలుపునిచ్చారు.

దిశ, కౌడిపల్లి : ఎల్‌నినో ప్రభావంతో ప్రస్తుత వర్షాభావ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని అధిక నీటితో సాగు చేసే వరి పంటకు బదులుగా తక్కువ నీటితో సాగు చేసే ప్రత్యామ్నాయ పంటలైన జొన్నలు, కందులు, పెసర, సజ్జలు, కొర్రలు, కూరగాయ పంటలను సాగు చేసి అధిక ఆదాయం పొందాలని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతారెడ్డి రైతులకు పిలుపునిచ్చారు. సోమవారం కౌడిపల్లిలోని రైతు వేదికలో వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విత్తన మేళాను ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే సునీతారెడ్డి, జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్‌తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా సునీతారెడ్డి మాట్లాడుతూ, రైతులు ప్రస్తుతం నెలకొన్న వర్షాభావ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని అధిక నీరు అవసరమయ్యే వరి పంటను సాగు చేసి ఆర్థికంగా నష్టపోవద్దని, తక్కువ నీటితో సాగు చేసే ఆరుతడి పంటలను సాగు చేయాలని పిలుపునిచ్చారు. ఆరుతడి పంటల సాగు కోసం వ్యవసాయశాఖ అధికారులు నిర్వహిస్తున్న అవగాహన సదస్సుల పట్ల ఆమె సంతృప్తి వ్యక్తం చేశారు.
ఆరుతడి పంటలను సాగు చేసేలా ఆయా గ్రామాల సర్పంచులు క్షేత్రస్థాయిలో రైతులకు విస్తృతంగా అవగాహన కల్పించాలని సునీతారెడ్డి కోరారు. నేల స్వభావం, వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా పంటలను ఎంపిక చేసుకుంటే పెట్టుబడి తగ్గడంతో పాటు దిగుబడి, ఆదాయం కూడా మెరుగుపడుతుందని తెలిపారు. వ్యవసాయ శాస్త్రవేత్తలు, అధికారుల సూచనలు పాటించి పంటలు సాగు చేయాలని సునీతారెడ్డి రైతులకు విజ్ఞప్తి చేశారు. రైతులకు కావాల్సిన డీఏపీ, యూరియా ఎరువులు, నాణ్యమైన విత్తనాలను ప్రభుత్వం అందుబాటులో ఉంచాలని కోరారు. జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ మాట్లాడుతూ, రైతులు తమ సమీప రైతు వేదికల్లో నిర్వహించే విత్తన మేళాలకు అధిక సంఖ్యలో హాజరై, వ్యవసాయ శాస్త్రవేత్తలు, వ్యవసాయ అధికారుల సలహాల మేరకు తమ ప్రాంతానికి అనువైన పంటలను ఎంపిక చేసుకుని నాణ్యమైన విత్తనాలను కొనుగోలు చేయాలని సూచించారు. వ్యవసాయంతో పాటు ఉద్యానవన పంటలు, పశుసంవర్ధక రంగం, కూరగాయల సాగు వంటి అనుబంధ వ్యవసాయ కార్యకలాపాలను కలిపి చేపడితే రైతులకు సంవత్సరం పొడవునా ఆదాయం లభిస్తుందని వివరించారు.
ప్రతి గ్రామంలోని వ్యవసాయ విస్తరణ అధికారులు (AEOలు) ఉద్యానవన పంటలు, ప్రత్యామ్నాయ పంటలు, ఆధునిక సాగు విధానాలపై రైతులకు నిరంతరం అవగాహన కల్పించాలని ఆదేశించారు. రైతుల అవసరాలను ఎప్పటికప్పుడు తెలుసుకుని వారికి అవసరమైన డ్రిప్ ఇరిగేషన్ సదుపాయాలు, నాణ్యమైన విత్తనాలు, సాంకేతిక సలహాలు సకాలంలో అందేలా వ్యవసాయ, ఉద్యానవన శాఖ అధికారులు సమన్వయంతో పని చేయాలని సూచించారు. జిల్లాలోని రైతులు ఆధునిక వ్యవసాయ పద్ధతులను అనుసరించి రాష్ట్రానికి ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు. జిల్లాలో లోటు వర్షపాతం ఉందన్నారు. ఎమ్మెల్యే సునీతారెడ్డి, కలెక్టర్ ప్రతిమా సింగ్ విత్తన మేళాలో ఏర్పాటు చేసిన వివిధ స్టాళ్లను సందర్శించి, అందుబాటులో ఉన్న విత్తనాలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి దేవకుమార్, నర్సాపూర్ ఆర్డీవో రామకృష్ణ, ఎంపీడీవో శ్రీనివాస్, ఏడీఏ పుణ్యవతి, డీఎల్పీఓ సురేష్‌బాబు, ఏవో స్వప్న, స్థానిక సర్పంచ్ చంద్రం కృష్ణగౌడ్, ఉద్యానవన శాఖ అధికారులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.






