రైతులు ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలి

by Ratna Kumari |

ఎల్‌నినో ప్రభావంతో ఈ ఏడాది వర్షపాతం తగ్గే అవకాశాలు ఉన్నందున రైతులు వరి సాగును పరిమితం చేసి ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టి సారించాలని ఖమ్మం జిల్లా కలెక్టర్ దివాకర్ టీఎస్ సూచించారు.

రైతులు ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలి
X

దిశ, కూసుమంచి : ఎల్‌నినో ప్రభావంతో ఈ ఏడాది వర్షపాతం తగ్గే అవకాశాలు ఉన్నందున రైతులు వరి సాగును పరిమితం చేసి ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టి సారించాలని ఖమ్మం జిల్లా కలెక్టర్ దివాకర్ టీఎస్ సూచించారు. భీరోలు నుంచి కూసుమంచి మండలానికి వెళ్తున్న సందర్భంగా పోచారం గ్రామంలో రైతులతో కలెక్టర్ మాట్లాడారు. ఈ ఏడాది సాధ్యమైనంత వరకు వరి పంట వేయకుండా ఉండాలని, ఒకవేళ సాగు చేసినా పరిమిత స్థాయిలో మాత్రమే సాగు చేయాలని సూచించారు. వర్షాభావ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయడం రైతులకు మేలు చేస్తుందని తెలిపారు.

ఈ సందర్భంగా పోచారం రైతులు కోతుల బెడద తీవ్రంగా ఉందని, పంటలను ధ్వంసం చేస్తున్నాయని కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై స్పందించిన కలెక్టర్ తహసీల్దార్, గ్రామ సర్పంచ్ సమన్వయంతో కోతుల సమస్య నివారణకు తగిన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. యూరియా పంపిణీపై మాట్లాడుతూ, యూరియా యాప్ సమర్థంగా పనిచేస్తోందని తెలిపారు. కూసుమంచి మండలానికి 20,400 యూరియా బస్తాలు బుక్ చేయగా, ఇప్పటికే 19,600 బస్తాలు సరఫరా చేశామని, మరో 800 బస్తాలు అందుబాటులో ఉన్నాయని వెల్లడించారు. యూరియా యాప్‌కు సంబంధించిన ఏవైనా సమస్యలు ఉంటే వ్యవసాయ విస్తరణ అధికారులను (ఏఈఓ) సంప్రదించాలని రైతులకు సూచించారు. అలాగే కొంతమంది రైతులు కాలువ పక్కనే ఉన్నప్పటికీ తమ చెరువుకు నీరు అందడం లేదని కలెక్టర్ దృష్టికి తీసుకురాగా, సమస్యను పరిశీలించి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో తహసీల్దార్ సైదులు, ఆర్‌ఐ రాము, వ్యవసాయ అధికారి ఆర్. వాణి, ఏఈఓ జానీబాబా, రైతులు పాల్గొన్నారు.

Next Story